Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-02 10:12:36
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో రూ.500 కోట్ల పెట్టుబడి తో వరుణ్ గ్రూప్ నిర్మించనున్న తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ కు తన తల్లి, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి తో కలిసి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం హోటల్‌కు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రావడంతో బ్రాండ్ వైజాగ్ పేరు తిరిగొచ్చిందని తెలిపారు. గత పది నెలల పాలనలో పారిశ్రామి కవేత్తల్లో విశ్వాసాన్ని పెంపొందించి, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టామని చెప్పారు. వ్యాపార అనుకూలమైన వాతావరణం నెలకొల్పడంతో పెద్దఎత్తున కంపెనీలను రప్పించగలిగామని వెల్లడిరచారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ఎంతోమంది పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో విశాఖ ప్రజలకు తమకు అండగా నిలిచారని, 2019లో రాష్ట్రమంతా ఎదురుగాలి వీచినా, విశాఖలో ఆదరించారని వివరించారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని స్పష్టం చేశారు. వరుణ్ గ్రూప్ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ యావత్ దేశానికి ఐకానిక్‌గా నిలవనున్నాయని వెల్లడిరచారు.