Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-02 10:07:38
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార సుంకాలు బుధవారం నుంచి అమలు కానున్నాయి. ఇందులో ఎలాంటి మినహాయింపుల్లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. టారిఫ్‌ల ప్రారంభం నేపథ్యంలో ఈ రోజును అమెరికాకు విమోచన దినంగా ట్రంప్ అభివర్ణించారు. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించామన్న ట్రంప్, చరిత్రలో ఏ దేశాన్నీ దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని మండిపడ్డారు.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100శాతం సుంకాలు వసూలు చేస్తోందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ అన్నారు. అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించారు. ఆయా దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్‌ల రూపంలో పీల్చేస్తూ, అన్యాయమైన వాణిజ్య విధానాలను అవలంబిస్తున్నాయన్నారు.
అమెరికా డెయిరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50శాతం, బియ్యంపై జపాన్ 700 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం, ఆల్కహాల్ పానియాలపై 150 శాతం, బటర్, చీజ్‌పై కెనడా 300 శాతం టారిఫ్ వసూలు చేస్తున్నాయని వెల్లడించారు. తమ ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా మారిందన్న కరోలిన్, అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.