Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-04-01 11:34:52
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వాటిని తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలకు దారి తీస్తుంది. కనీసం 30 నిమిషాల తరువాత మాత్రమే నీరు తాగడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి. క్రమం తప్పకుండా పండ్లు తినడం వల్ల స్ట్రోక్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి మనం రక్షణ పొందొచ్చు. అయితే పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పండ్లు సహజసిద్ధమైన పాచక రసాలు కలిగి ఉంటాయి. వీటి వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. కానీ పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే అవి నీటితో కలసి ఆయా ఎంజైమ్‌ల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCL) ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కానీ పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే ఆ ఆమ్లం ప్రభావం తగ్గిపోతుంది. దాని వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. ఇది కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు కారణం అవుతుంది. దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి తిన్న వెంటనే నీరు తాగితే శరీరంలో నీటి స్థాయులు ఎక్కువై, ప్రేగుల కదలికలు వేగంగా మారుతాయి. దీనివల్ల జీర్ణక్రియ అసమతుల్యతకు గురై విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల శరీరంలోని pH స్థాయి మారుతుంది. ఈ మార్పుల వల్ల జీర్ణ ప్రక్రియ మందగించి ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా శోషించబడవు.
జీర్ణ వ్యవస్థలో ఉన్న గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లు ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే ఈ ఎంజైమ్‌లు సరిగ్గా పనిచేయవు. దీని ప్రభావంగా ఆహారం అసంపూర్తిగా జీర్ణమై.. శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా లభించవు. పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ఇది కడుపులో మంట, అసౌకర్యం, గ్యాస్ వంటి సమస్యలకు కారణమవుతుంది. ప్రత్యేకంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలి. పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు. శరీరానికి మేలు కావాలంటే కనీసం 30 నుంచి 45 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ సజావుగా జరిగి పండ్లలోని పోషకాలు పూర్తిగా శరీరానికి లభిస్తాయి.