Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 10:55:28
తెలుగు వెబ్ మీడియా న్యూస్:రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందని పేర్కొన్నారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది లేదని పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. ప్రభుత్వం ఇక్కడ చేపట్టే ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా రాజకీయ నాయకులేనని, కొందరు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీయూ భూ వివాదంపై ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
66 2003 జనవరి 13న నాటి ప్రభుత్వం ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు మెమో నం. 39612/ఏఎస్ఎస్ఎన్/వి(2) 2003 ప్రకారం కంచ గచ్చిబౌలి గ్రామంలోని భూమిని కేటాయించింది. ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబరు 21న కేటాయింపును రద్దు(నం.111080/ఎస్1/2003) చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంటుకు కేటాయించింది.
• ఈ భూమి కేటాయింపులపై ఐఎంజీ అకడమీస్ హైకోర్టులో 2006లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి ఏపీలో రోశయ్య, కిరణ్కుమారెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు ఈ భూమి ప్రభుత్వానిదని వాదనలు వినిపించాయి. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. దీంతో 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిని ఐఎంజీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా పటిష్ఠమైన వాదనలు వినిపించడంతో 2024 మే 3న సదరు పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో 400 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి దక్కాయి.
• 2024 జూన్ 19న ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆ భూమిని కేటాయించాలని టీజీఐఐసీ ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో రెవెన్యూశాఖ జూన్ 24న ఆ భూమి హక్కులను టీజీఐఐసీకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు భూమికి పంచనామా నిర్వహించి జులై 1న అప్పగించారు. ఆ భూమి అటవీ పరిధిలో లేదని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టమవుతోంది.
• జులై 19న వర్సిటీ రిజిస్ట్రార్, ఇంజినీర్, ఈఈతో కలిసి రెవెన్యూ అధికారుల సమక్షంలో భూ సర్వే చేసి హద్దులు నిర్ధారించారు. టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో బఫెల్లో లేక్, పికాక్ లేక్లు లేవు. టీజీఐఐసీ రూపొందించే లేఅవుట్లో మష్రూమ్ రాక్స్ తోపాటు ఇతర రాళ్ల అమరికను హరిత స్థలాలుగా పరిరక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది” అని పొంగులేటి పేర్కొన్నారు.