Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-01 10:54:46
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ వంటి భారీ హిట్టర్లు కలిగిన సన్‌రైజర్స్‌లో బంతిని మరింత బలంగా బాదే దొరికే కుర్రాడు దొరికాడు. ఉన్నఫళంగా టాపార్డర్ విఫలమైనా స్లాగ్ ఓవర్స్‌లో రన్‌రేట్‌ను పెంచేందుకు లోయరార్డర్‌లో ఓ బ్యాటర్ ఉండాలన్నా వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా దొరికాడు అనికేత్ వర్మ. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పుట్టి భోపాల్‌లో క్రికెట్ ఓనమాలు దిద్దుకుని దేశవాళీలో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న 23 ఏండ్ల ఈ కుర్రాడు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ వెలికితీసిన మరో ఆణిముత్యం.
సిక్స్ మాస్టర్
లక్నోతో మ్యాచ్‌లో 12 ఓవర్లకే నలుగురు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడంతో క్రీజులోకి వచ్చిన అనికేత్ 13 బంతుల్లోనే 36 పరుగులు రాబట్టాడు. ఇందులో ఏకంగా ఐదు సిక్సర్లున్నాయి. క్రీజును వదలకుండా ఉన్నచోటే సిక్సర్లు కొట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ ప్రదర్శనతో ఢిల్లీతో మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ ప్రమోషన్ లభించింది. స్టార్క్ దెబ్బతో 25 పరుగులకే 3 వికెట్ల కోల్పోవడంతో క్రీజులోకి అడుగుపెట్టిన అనికేత్ ఫియర్‌లెస్ అప్రోచ్ తో దంచికొట్టాడు. అతడి బాదుడుకు ఢిల్లీ సారథి అక్షర్ బాదితుడిగా మిగిలాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో అతడు 74 రన్స్ చేస్తే అందులో సిక్సర్లు (6), బౌండరీలు (5) రూపంలో వచ్చినవే 50 పరుగులు. చూడటానికి బక్కపలచగా ఉన్నా అలవోకగా సిక్సర్లు బాదేందుకు కఠోర సాధన చేశానంటాడు అనికేత్. గత రెండు ఇన్నింగ్స్‌లలో అతడి మెరుపులే ఇందుకు నిదర్శనం.
అలా వెలుగులోకి..
చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో మామయ్య అమిత్ వర్మ దగ్గర పెరిగిన అనికేత్ పసిప్రాయం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. అతడి ఆసక్తిని గమనించిన అమిత్ డబ్బులకు వెనుకాడకుండా శిక్షణ ఇప్పించాడు. పదేండ్ల ప్రాయంలో భోపాల్‌లోని అంకుర్ క్రికెట్ అకాడమీలో కోచ్ జ్యోతి ప్రకాశ్ త్యాగి వద్ద చేరడం అనికేత్ క్రికెట్ కెరీర్‌లో కీలక మలుపు. ఓసారి అండర్-12 స్థాయిలో అనికేత్ 256 పరుగులు చేయగా అతడి కోచ్ వచ్చి ఏదో ఒకరోజు నువ్వు 400 పరుగులు చేస్తావు అని చెప్పాడట. అది అనికేత్‌లో కసిని మరింత పెంచింది. కోచ్ మాటలను నిజం చేస్తూ రెండేండ్ల క్రితం ఓ ఇంటర్ డివిజనల్ మ్యాచ్‌లో చంబల్‌పై అతడు 400 (ఇందులో 41 బౌండరీలు, 16 సిక్సర్లున్నాయి) రన్స్ చేశాడు. ఈ ప్రదర్శనే మధ్యప్రదేశ్ లీగ్ (ఎంపీఎల్)లో ఫ్రాంచైజీల కన్ను ఈ కుర్రాడిపై పడేలా చేసింది. 2024 సీజన్‌లో అనికేత్ ఫేత్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతూ ఆ సీజన్‌లో టాప్ స్కోరర్ (273)గా నిలిచాడు. ఒక మ్యాచ్‌లో 32 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ టోర్నీలో అనికేత్ మొత్తం 25 సిక్సర్లు కొట్టడం విశేషం. అనికేత్ ప్రతిభను గుర్తించిన ఎస్‌ఆర్‌హెచ్ బృందం.. వేలంలో అతడిని రూ. 30 లక్షలకు దక్కించుకుంది. పెట్టిన ప్రతి పైసాకూ న్యాయం చేస్తున్న ఈ కుర్రాడు ఇదే జోరు కొనసాగిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం లాంఛనమే!