Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 10:51:03
తెలుగు వెబ్ మీడియా న్యూస్:కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేసి గొప్ప వృక్ష సంపదను నిర్మూలిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల అంశంపై సోమవారం ఆయన \'ఎక్స్\'లో పోస్టు చేశారు. \"దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడం, విద్యార్థులను అణచివేయడం, చెట్లను నరికివేయడంతోపాటు పచ్చదనం, జీవ వైవిధ్య ధ్వంసానికి పాల్పడుతోంది. అర్ధరాత్రి వేళ ఈ ప్రాంతంలోని చెట్లను కొట్టేస్తుంటే మన జాతీయ పక్షులైన నెమళ్ల ఆర్తనాదాలు వింటే నా గుండె తరుక్కుపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా” అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ సర్కారు తన నిర్ణయం మార్చుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి డిమాండు చేశారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశానికి హాజరయ్యే ముందు బండి సంజయ్ మాట్లాడుతూ.. \"హెచ్సీయూ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడం దారుణం. అమ్మాయిలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాక్కుపోయి కొట్టారు. భూములు అమ్మకుండా రాష్ట్రాన్ని పాలించలేరా? ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది? లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రేషన్లో ఇస్తున్న సన్నబియ్యం మొత్తం ఖర్చు ఎంత... అందులో కేంద్ర, రాష్ట్ర వాటా ఎంతో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కాంగ్రెస్, భారాస, ఎంఐఎం ఒక్కటవుతున్నాయి. భాజపా పోటీ చేయాలని భావిస్తోంది. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటాం” అని పేర్కొన్నారు. ఈటల మాట్లాడుతూ.. \"హెచ్సీయూ రాష్ట్రానికే తలమానికం. ఇందులో చదివిన వేల మంది విద్యార్థులు నిష్ణాతులై రాష్ట్రానికి మంచి పేరు తెచ్చారు. ఇప్పుడు హెచ్సీయూ భూములు అమ్మి అప్పులు కట్టాలని సర్కారు భావిస్తుండడం దారుణం. రాజధాని కాంక్రీట్ జంగిల్గా మారుతున్న తరుణంలో పచ్చటి వర్సిటీ భూములను కూడా విక్రయించడం తిరోగమన చర్య” అని దుయ్యబట్టారు. విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. \"హెచ్సీయూ భూములు సర్కారువేనని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో సహజ సిద్ధమైన రాక్ ఫార్మేషన్లు ఉన్నాయి. గతంలో ఈ భూములను వర్సిటీకి కేటాయించి నోటిఫై చేస్తామని తెదేపా, కాంగ్రెస్, భారాస ప్రభుత్వాలు హామీ ఇచ్చి చేయలేదు. సీఎం రేవంత్రెడ్డి భూముల విక్రయంపై పునరాలోచించాలి\" అని సూచించారు.