Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 10:45:42
తెలుగు వెబ్ మీడియా న్యూస్:హెచ్సీయూ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన అణచివేతకు పాల్పడుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థుల పోరాటానికి భారాస అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో పలువురు హెచ్సీయూ విద్యార్థులు ఆయనతో సమావేశమయ్యారు. వర్సిటీ భూముల వ్యవహారంలో జరుగుతున్న సంఘటనలను వివరించారు. అనంతరం వారితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. \"తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హెచ్సీయూ. తొలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత దీనిని ఏర్పాటు చేశారు. ఈ మధ్య కొత్తతరం విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందని అప్పుడప్పుడు బాధపడుతుంటాం. కానీ, ప్రస్తుతం వర్సిటీ విద్యార్థులు చూపుతున్న తెగువ, వారి పోరాటానికి సెల్యూట్ చేస్తున్నా. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారి పక్షాన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. భూముల కబ్జాకు ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు? భవిష్యత్తులో హైదరాబాద్లోనూ దిల్లీలో మాదిరిగా ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడేలా ఉంది. పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందనే అంచనా వేయకుండా 400 ఎకరాలను ఎందుకు అమ్ముతున్నారు? 2003లో \'ఐఎంజీ భారత్\' అనే కంపెనీకి క్రీడా సదుపాయాల కోసం ఈ భూములను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కానీ ఈ ప్రభుత్వం దానిని కాంక్రీట్ జంగిల్ మార్చే ప్రయత్నం చేస్తోంది. ప్యూచర్సిటీ, ఫార్మాసిటీలకు ఇప్పటికే వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండగా.. ఈ 400 ఎకరాలపై ఎందుకింత దాష్టీకంగా వ్యవహరిస్తున్నారు? హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. హైకోర్టు ఆదేశాలు రాక ముందే తెలంగాణ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? పిల్లల భవిష్యత్తును పణంగా పెడుతుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? హెచ్సీయూకి రావాలని విద్యార్థులు కోరుతున్నా దీన్ని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వస్తాయని నేనే వెళ్లడం లేదు. సరైన వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తుతాం. రాజ్యసభలో మా పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ అంశంపై భాజపా సహా అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలి” అని కేటీఆర్ పేర్కొన్నారు.