Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-01 10:18:38
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తామని, అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. అయితే అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ మిషన్ విజయవంతం కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు సునీతా విలియమ్స్ ధన్యవాదాలు తెలిపారు. డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమిపైకి వచ్చిన 12 రోజుల అనంతరం తొలిసారి వారు బాహ్య ప్రపంచం ముందుకు వచ్చారు. హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సునీతతో పాటు వ్యోమగాములు బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మాట్లాడారు.
గతంలో తీసుకున్న శిక్షణ మమ్మల్ని ఐఎస్‌ఎస్‌కు తీసుకువెళ్లేలా సిద్ధం చేసిందని సునీతా విలియమ్స్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తాము తిరిగి భూమిపైకి రావడంలో, పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే మూడు మైళ్లు పరుగెత్తానని తెలిపారు. అయితే, అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయని, అందుకు తగ్గట్లు కొన్ని సర్దుబాట్లు అవసరమన్నారు. తాను మళ్లీ సాధరణంగా స్థితికి రావడానికి సహాయం చేసిన శిక్షకులకు ఈ సందర్భంగా సునీతా ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలో తమ టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని పేర్కొన్నారు.
మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని విల్మోర్ అన్నారు. ఇక స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.
గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక 'స్టార్‌లైనర్'లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వారు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో వారు ఐఎస్‌ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు.