Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-01 10:11:14
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : వరుస భూప్రకంపనలతో దెబ్బతిన్న మయన్మార్‌లో మహా విషాదం నెలకొంది. భూకంపం ధాటికి నేలమట్టమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భూవిలయంలో మృతుల సంఖ్య 2,056కి పెరగగా, 3900 మందికి పైగా గాయపడినట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా 270 మంది ఆచూకీ లభ్యం కాలేదని పేర్కొంది.
కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
ఒకవైపు మృతదేహాలు, మరోవైపు క్షతగాత్రులతో అక్కడి ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. భూకంపం వచ్చి 3 రోజులు గడుస్తున్న నేపథ్యంలో శిథిలాల కింద చిక్కుకున్నవారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు, మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా, తమవారు సజీవంగానే ఉండొచ్చనే ఆశతో పలువురు తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.
అనేక సందేహాలు
మయన్మార్‌లో భూకంపం తీవ్రతపై సైనిక ప్రభుత్వం విడుదల చేస్తున్న సమాచారంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2021 నుంచి ఆ దేశ సైనిక ప్రభుత్వం- మీడియాపై నియంత్రణ, ఇంటర్నెట్ వినియోగం పరిమితం చేయడం లాంటివే ఇందుకు కారణం. అక్కడ వేలాది మంది ప్రజలు నీరు, విద్యుత్ లేక అల్లాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. భూకంపం వల్ల జరిగిన విధ్వంసాన్ని కవర్ చేసేందుకు తమకు అనుమతించాలంటూ అంతర్జాతీయ జర్నలిస్టుల అభ్యర్థనను సైతం అక్కడి ప్రభుత్వం తిరస్కరించినట్లు సదరు కథనాలు తెలిపాయి. మరోవైపు, మయన్మార్‌లోని సాగింగ్ నగరంలోని ఓ హైస్కూల్‌లో 8 మంది చిన్నారులు, ముగ్గురు టీచర్లు ఇప్పటికీ శిథిలాల్లోనే చిక్కుకొని ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు.