Category : | Sub Category : క్రైమ్ Posted on 2024-01-20 11:04:21
TWM Live News: కొరియా పేరుతో వ్యాపారిని భేదిరించి దోచేసిన నేరగాళ్లు...
వేగంగా స్పందించి లక్షలు రికవరీ చేసిన హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్...
వ్యాపారిని బెదిరించి జమ్మూకశ్మీర్లోని తమ బ్యాంకు ఖాతాలో 98 లక్షలు వేయించుకున్న సైబర్ నేరగాళ్లు క్షణాల్లోనే ఆ సొమ్మును దేశవ్యాప్తంగా ఉన్న 11 ఖాతాలకు మళ్లించారు. ఆ వెంటనే అందులో నుంచి 15 లక్షలు డ్రా చేసుకున్నారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు వారి మెరుపు వేగం చూసి విస్తుపోయారు. కానీ ఎట్టకేలకు అతికష్టం మీద 83 లక్షలు తిరిగి రాబట్టగలిగారు. అత్యంత నాటకీయంగా జరిగిన ఈ ఉదంతం సైబర్ నేరగాళ్ల పటిష్ట నెట్వర్క్ ను తెలియజేస్తోంది...
హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారికి వారం రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది. తాము కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమని పరిచయం చేసుకున్నారు. ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరుపై ఒక పార్శిల్ వచ్చిందని, అందులో మత్తుమందులు ఉన్నాయని. కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ వ్యాపారి తనను రక్షించమని వేడుకున్నారు. మేం చెప్పిన ఖాతాలో రూ.కోటి జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు. అసలే భయంతో ఉన్న ఆయన వెంటనే 98 లక్షలు బదిలీ చేశారు. ఆ తరువాత అనుమానం వచ్చి వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు వివరాలు చేరాయి. రంగంలోకి దిగిన అధికారులు తొలుత బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకుకు ఫోన్ చేయగా.. .ఆ డబ్బు కశ్మీర్ లోని బారాముల్లా పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో జుజు అనే వ్యక్తి ఖాతాలో జమయ్యాయని చెప్పారు. పీఎన్బీకి ఫోన్ చేయగా....అక్కడి నుంచి అయిదు వేర్వేరు రాష్ట్రాల్లోని బ్యాంకులకు మళ్లించారని తేలింది. వెంటనే ఆ అయిదు బ్యాంకులకు ఫోన్ చేస్తే అక్కడి నుంచి మరో ఆరు ఖాతాలకు మళ్లించారని తేలింది. ఆ బ్యాంకులకు కూడా ఫోన్ చేసిన అధికారులు జరిగిన మోసం గురించి వివరించారు. కేసు నమోదు చేస్తున్నామని, ముందు ఆ డబ్బు ఎవరూ డ్రా చేయకుండా నిలిపివేయాలని కోరారు. కానీ అప్పటికే సైబర్ నేరగాళ్లు 15 లక్షలు డ్రా చేయగా... మిగతా 83 లక్షలు మాత్రం నిలిపివేయగలిగారు. ఒకటే కేసులో ఇంత భారీ మొత్తం రికవరీ చేసి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రికార్డు సృష్టించారు.