Category : నేర | Sub Category : ఆంధ్రప్రదేశ్ Posted on 2025-04-12 10:45:34
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :- ముగ్గురు చిన్నారులు.. అల్లారుముద్దుగా మాట్లాడుతూ.. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ అప్పటివరకు కళ్లముందు కనిపించారు. సడెన్‌గా.. కనిపించకుండా పోయారు.. ఆడుకుంటూ ఆడుకుంటూ.. ఓ నీటి గుంత దగ్గరకు వెళ్లారు.. అలా వెళ్లిన ముగ్గురు చిన్నారులు కూడా నీటి గుంటలో పడి మృత్యువాత పడ్డారు.. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారులు అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నీటి కుంటలో దిగిన ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి మండలం ఎం రాచపల్లిలో చోటుచేసుకుంది. స్థానికంగా మట్టి కోసం తవ్విన గుంతలో ఇరుక్కుపోయి విజయ్ (6), దేవాన్ష్ (6), యశ్వంత్ (7) మృతిచెందారు.
శుక్రవారం ఇంటి పరిసర ప్రాంతంలో మట్టికోసం తవ్విన గుంట వద్దకు ముగ్గురు చిన్నారులు ఆడుకోవడానికి వెళ్ళారు. సాయంత్రం వేళ ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు.. ఇలా మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో మట్టికోసం ఇటీవల గుంత తవ్వారు.. అయితే.. ఆతవ్విన గుంతలో గత వారం కురిసిన వర్షానికి నీరు నిండటంతో నీటిలో ఆడుకుంటూ చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో గాలించారు.. చివరకు నీటి గుంతలో వెతకగా.. చిన్నారులు ఇరుక్కుపోయి విగత జీవులుగా కనిపించారు.. వెంటనే వారిని బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.