Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-12 10:43:50
తెలుగు వెబ్ మీడియా న్యూస్:కంచ గచ్చిబౌలి భూముల వెనుక రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం జరిగిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. టీజీఐఐసీకి కేవలం జీవో ద్వారా భూ కేటాయింపులు మాత్రమే చేశారని, సాంకేతికంగా భూముల బదలాయింపు ప్రక్రియ జరగనే లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో థర్డ్ పార్టీ సంస్థలు కీలకంగా వ్యవహరించాయని, ఏ ప్రాతిపదికన ఆ సంస్థలను ఎంపిక చేశారో ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. భూ యాజమాన్య హక్కు ఎవరికి ఉందో తెలుసుకోకుండానే ఐసీఐసీఐ బ్యాంకు రూ.10 వేల కోట్ల రుణానికి బాండ్లు ఎలా ఇచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కుంభకోణం వెనుక సూత్రధారి ముఖ్యమంత్రేనని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. శుక్రవారం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. “ఇదొక నేరపూరిత కుట్ర. \'రిజర్వ్ ఫారెస్ట్\' అని ప్రత్యేకంగా నిర్ధారించకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నపక్షంలో యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నప్పటికీ దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం అటవీ భూములను తాకట్టు పెట్టే లేదా అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఒక భాజపా ఎంపీ సహకారంతో \'ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్\' అనే కంపెనీని ఇందులోకి తీసుకొచ్చారు.ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.169 కోట్ల కమీషన్ చెల్లించింది. ఆ తర్వాత \'బీకాన్ ట్రస్టీషిప్\' అనే కంపెనీని ముందుపెట్టి తెర వెనుక కుట్రను అమలుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎకరం రూ.75 కోట్ల చొప్పున ఆ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదలాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. తొలుత ఆ భూమి విలువను రూ.30 వేల కోట్లుగా ప్రకటించి, ఆ తర్వాత రూ.16,640 కోట్లకు కుదించింది. విలువను తగ్గించడం ద్వారా తమకు సంబంధించిన వారికి చవగ్గా భూములను కట్టబెట్టాలని సీఎం రేవంత్రెడ్డి కుట్రపన్నారు. ఎలాంటి పరిశీలన చేయకుండానే, సేల్డీడ్ లేని భూమికి ఐసీఐసీఐ బ్యాంకు రూ.10 వేల కోట్ల విలువైన బాండ్లు ఇచ్చింది. దీనిపై సీబీఐ, ఆర్బీఐ గవర్నర్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్, సెబీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలకు మా పార్టీ తరఫున ఆధారాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నాం” అని కేటీఆర్ పేర్కొన్నారు. మరో రూ.60 వేల కోట్ల భూదోపిడీకి కూడా ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని, ఇప్పుడు దీన్ని అడ్డుకోకపోతే ఆ వ్యవహారం కూడా కొనసాగే ప్రమాదం ఉన్నందునే తాము పోరాడుతున్నామన్నారు. పార్టీ తరఫున ప్రధానమంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ తెలిపారు.