Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-11 16:26:40
వైకాపా అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఏనాడూ సకాలంలో ఫీజులను చెల్లించలేదు. సీఎం జగన్ మాత్రం ప్రతి సభలోనూ అలవోకగా అబద్దాలు చెప్పేస్తారు. ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే డిసెంబరు, జనవరి మొదటి వారంలో సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి. అంటే సగం విద్యా సంవత్సరం అయిపోయినట్లే. ఇప్పటివరకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన ఒక్క త్రైమాసికం ఫీజునూ విడుదల చేయలేదు. మరోవైపు త్రైమాసికం పూర్తయిన వెంటనే ఫీజులు విడుదల చేస్తున్నామంటూ జగన్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. బీటెక్ నాలుగో ఏడాది విద్యార్థులకు ఏప్రిల్ 29తో విద్యా సంవత్సరం ముగిసిపోతుంది. ఈ లెక్కన వారికి మరో మూడున్నర నెలలు మాత్రమే సమయముంది. వీరికి మూడు త్రైమాసికాల పీజులు విడుదల చేయాలి. ఈ విద్యా, సంవత్సరానికి సంబంధించి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. విచిత్రమేమిటంటే 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన చివరి త్రైమాసికం పీజును డిసెంబరు 29న విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరం డిగ్రీ, బీటెక్ మొదటి ఏడాదికి ఆగస్టులో తరగతులు ప్రారంభమయ్యాయి, బీటెక్ మూడో, నాలుగో ఏడాది వారికి జులై 17 నుంచి బోధన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక్క త్రైమాసికం ఫీజు కూడా చెల్లించలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల మందికి పైగా విద్యార్థులను జగన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రభుత్వం చెల్లించే ఫీజుల డబ్బు తల్లుల ఖాతాల్లోనే పడుతున్నందున వాటితో తమకు సంబంధం లేదని, వెంటనే ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. దాంతో పిల్లల ఇబ్బందులు చూడలేక కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి, ఫీజులు కట్టారు. గత డిసెంబరులో సెమిస్టర్ పరీక్షలకు ముందే చాలా కళాశాలలు సగం ఫీజులు, మరికొన్ని యాజమాన్యాలు వంద శాతం ఫీజు వసూలు చేసేశాయి.