Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-03 05:19:16
ఈ నెల 5వ తేదీ నుంచి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దానిలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి ‘రా… కదలిరా’ పేరుతో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. జనవరి 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది.
ఇవాళ మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు రా… కదలి రా… కార్యక్రమ షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రోజుకి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు.
ప్రతి సభకు లక్షలాది ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని, తమ నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని పలువురు నేతలు కోరుతున్నా, సమయా భావం వల్ల కొన్నిప్రాంతాలకే పరిమితమయ్యారని పేర్కొన్నారు.
“సభలకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నాం. 1982లో టిడిపి ఆవిర్భవించక ముందు ఉన్న పరిస్థితుల కంటే దారుణమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దాలంటే, మరలా రాష్ట్రానికి కొత్త ఊపిరి రావాలంటే, చంద్రబాబునాయుడి నాయకత్వంతోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.
కర్షకులు, కార్మికులు, మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు, శ్రామికులు ఇలా అందరూ ఆనందంగా బతకాలంటే అది చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. రాష్ట్రానికి స్వర్ణయుగం టిడిపితోనే సాధ్యం. ఏపీ ఒక నూతన నవోదయం చూసేందుకు టిడిపి-జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. రెండుపార్టీల కలయికను, అవి నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారు” అని అచ్చెన్నాయుడు వివరించారు.
కాగా… టిడిపి – జనసేన కలిసే సభల్ని నిర్వహిస్తున్నాయని, చంద్రబాబుతో పాటు, పవన్ కల్యాణ్ కూడా కొన్ని సభలకు హాజరవుతారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. టిడిపి చేపట్టబోయే కార్యక్రమాలు, చంద్రబాబునాయుడి సభలకు భారీగా తరలి వచ్చి వాటిని విజయవంతం చేయాలని ప్రజల్ని కోరుతున్నామని పిలుపునిచ్చారు.