Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-24 10:33:32
TWM News : దేశం గర్వించ దగిన ఘటన అది..! దాయాది దేశం దొంగచాటు కుట్రలకు… తగిన గుణపాఠం చెప్పిన.. చిరస్మరణీయ విజయానికి నిదర్శనం అది..! నక్కజిత్తుల పాకిస్తాన్ జలాంతర్గామి ఘాజిని.. విశాఖ సముద్రంలో జల సమాధి చేసిన భారత్ పౌరుషం అది!! ఘాజీ… ఈపేరు వినగానే భారత దేశ యుద్ధ చరిత్రలో ఒక అమోగ విజయం గుర్తుకు వస్తుంది. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించిన PNS ఘాజీని.. సముద్ర గర్భంలోనే.. ఇండియన్ నేవీ మట్టుపెట్టింది. భారత్‌ను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించి… చావుదెబ్బలు తిన్న పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలను భారత నౌకాదళం గుర్తించింది.
1971 యుద్ధం స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన సంఘటన. మన నేవీ ఎంత బలమైనదో ప్రపంచానికి చాటి చెప్పిన సంవత్సరం అది. మన దేశానికి చెందిన అతి ప్రతిష్టాత్మక యుద్ధ నౌక INS విక్రాంత్‌ను నాశనం చేయడానికి దొంగ చాటుగా పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీ, వైజాగ్ తీరం వైపు వచ్చింది. దీనిని ముందుగానే పసిగట్టిన ఇండియన్ నేవీ విక్రాంత్ నౌకను మరో చోటుకు తరలించి వేరే యుద్ద నౌక INS రాజ్ పుత్ ను ఘాజీ కోసం రెడీ చేసింది. ఇది తెలియని పాక్ సబ్ మెరైన్ ఘాజీ.. విక్రాంత్‌తోపాటు విశాఖ నగరాన్ని ధ్వంసం చేసే ప్లాన్‌తో విశాఖ తీరానికి చేరుకుంది. అది సరైన టార్గెట్ రేంజ్‌కు రాగానే రాజ్ పుత్ దానిపై దాడి చేసింది. ఊహించని ఎటాక్‌తో షాక్‌కు గురైన పాక్ నేవీకి చెందిన సెయిలర్స్ ఘాజీతో పాటే సముద్ర గర్భంలోనే జల సమాధి అయిపోయారు.
1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి విశాఖపట్టణం వరకు చొచ్చుకొచ్చి భారత్‌ను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించి చావుదెబ్బలు తిన్న పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను భారత నౌకాదళం గుర్తించింది. ఇండియన్ నేవీలోని సబ్‌మెరైన్ రెస్క్యూ విభాగం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వీటిని గుర్తించింది. భారత అమ్ములపొదిలోకి ఇటీవల వచ్చి చేరిన ‘ది డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్- డీఎస్ఆర్‌వీ-త సాయంతో ఈ శకలాలను కనుగొన్నారు. విశాఖపట్టణం తీరానికి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర గర్భంలో 100 మీటర్ల లోతున శకలాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారం కావడంతో వాటిని తాకలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే కచ్చితంగా ఎప్పుడు లభ్యమైందో మాత్రం చెప్పలేదు.
వాస్తవానికి సముద్ర గర్భం చాలా రఫ్ గా ఉంటుంది. రాళ్లు, చిన్న చిన్న కొండలు, చెట్లు మధ్య సబ్ మెరైన్ ల ప్రయాణం అంటే చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఈ సవాళ్ల ను అధిగమించడానికి జలాల కింద ఉపరితలం ఎలా ఉందో అంచనా వేయడానికి, మన సబ్ మెరైన్ లు సాఫీ గా ప్రయాణించేందుకు అనువైన మార్గాలను అన్వేషించేందుకు డీఎస్‌ఆర్‌పీ సహాయపడుతుంది. ఈ డీఎస్‌ఆర్‌పీ మొదట మ్యాపింగ్ చేస్తారు. సాధారణంగా విశాఖ తీరంలో సముద్రం సగటున 16 మీటర్ల లోతు ఉంటుంది. నౌకలు నిలిపేందుకు ఇది అవసరమైన కనీస లోతు. కనీసం ఈ లోతు ఉంటే సబ్ మెరైన్ లు తీరం సమీపంలోకి వచ్చి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి అనువైన పరిస్థితులు ఉండబట్టే.. 1971లో పీఎన్ఎస్ గాజీ వైజాగ్ తీరానికి చేరి కనపడకుండా ఉండగలిగింది.
2013లో ఐఎన్ఎస్ సింధరక్షక్ ప్రమాదానికి గురై 13 మంది మరణించారు. దీంతో ఇండియన్ నేవీ 2018లో తొలిసారి డీఎస్ఆర్వో టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ప్రమాదానికి గురైన నౌకలు, సబ్మెరైన్లను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు దీనిని వాడాలని నిర్ణయించింది. ప్రస్తుతం మన దగ్గర రెండు డీఎస్ఆర్వోలు వినియోగంలో ఉన్నాయి. ఒకటి తూర్పు, మరొకటి పశ్చిమ తీరంలో వాడుతున్నారు. వీటిని నౌకలు లేదా విమానాల్లో తరలించవచ్చు. సాధారణంగా సముద్ర గర్భం లోపలకు వెళ్లే కొద్దీ ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. డీఎస్ఆర్ట్వీకి 650 మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది. వైజాగ్లోని హిందూస్థాన్ షిప్ యార్డ్ ఇలాంటివి మరో రెండింటిని దేశీయంగా తయారు చేస్తోంది.
మొత్తానికి.. ఇండియన్ నేవీ డీఎస్ఆర్వో టెక్నాలజీతో.. మరోసారి అందరికీ ఆనాటి ఇండో – పాక్ యుద్ధం, ఘాజీని మట్టు బెట్టడం లాంటి అనేక అంశాలు అందరికీ గుర్తొచ్చాయి.