Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-24 10:28:11
TWM News : కలియుగం ప్రత్యక్ష దైవం వెంకన్న పాదాల చెంత వెలసిన ఆధ్యాత్మిక నగరి తిరుపతి… ఇవాళ 894వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. గోవిందరాజ స్వామి ఆలయం నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వీ సంగీత నృత్య కళాశాల సహకారంతో విభిన్న కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
1130వ సంవత్సరంలో భగవద్ రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతి ఆవిర్భావం జరిగిందని టీటీడీ చైర్మన్ భూమన తెలిపారు. సౌమ్య నామ సంవత్సరం, ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తరా నక్షత్రంతో కూడిన సోమవారం నాడు తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి, కైంకర్య నిర్వహణ కార్యక్రమాలు, నాలుగు మాడ వీధుల నిర్మాణం ప్రారంభించారని భూమన తెలిపారు.
తిరుపతిని మొదట్లో శ్రీ గోవిందరాజ పట్నంగా, తర్వాత శ్రీ రామానుజపురంగా పిలిచేవారని, 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతిగా పిలుస్తున్నారని చెప్పారు భూమన. మరోవైపు ఆవిర్భావ దినోత్సవానికి స్థానికులతో పాటు శ్రీవారి భక్తులు కూడా పెద్దఎత్తున ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.