ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. మంత్రి బొత్సకు పోటీగా కీలక నేత..?
Category : |
Sub Category : రాజకీయం Posted on 2024-02-23 11:12:47
TWM News : అధికార వైసిపిలో ఉత్తరాంధ్ర జెయింట్ కిల్లర్‌పై ప్రత్యేక దృష్టి సారించింది ప్రతిపక్ష టిడిపి. మూడు జిల్లాలో గట్టి పట్టున్న ఆ నేతను ఒక్కచోటే అష్ట దిగ్బంధనం చేస్తే ఎన్నికల్లో తమకు గట్టిగా కలిసొస్తుందనేది ప్రతిపక్ష పార్టీ వ్యూహం. అందుకోసం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి ఆయనపై మరో ట్రబుల్ షూటర్‌ను బరిలోకి దించనున్నట్లు తెలుస్తుంది. బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆయనకంటూ సొంత ఇమేజ్, వ్యక్తిగత ఓట్ బ్యాంక్‌తో పాటు దూకుడుగా ముందుకెళ్లటం ఆయన స్టైల్. రాజధాని వ్యవహారం కావచ్చు? ఉద్యోగ సంఘాల డిమాండ్లు కావచ్చు? ఏ అంశమైన సింపుల్‌గా హ్యాండిల్ చేయగల దిట్ట. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గట్టిపట్టున్న నేత. ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఆయన వ్యూహాలు, ప్రణాళికలతో ప్రభావం చేయగల నేత. ప్రస్తుతం బొత్స చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇలా మూడు జిల్లాలో బొత్స పర్యటిస్తూ తనదైన శైలిలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బొత్స పోటీచేస్తున్న చీపురుపల్లిలో ధీటైన నేతను బరిలోకి దింపితే బొత్సను అక్కడే కట్టడి చేయొచ్చు అన్నది టిడిపి వ్యూహం. బొత్స తన సీటు తాను కాపాడుకోవడానికి చీపురుపల్లిలోనే టైమ్ కేటాయిస్తే విశాఖ పార్లమెంట్‌తో పాటు ఇతర నియోజకవర్గాల్లో సైతం బొత్స హవాకు చెక్ పెట్టి అధికార వైసిపికి గండి కొట్టొచ్చు అనేది టిడిపి యోచన. దీంతో ఇక్కడ ఇప్పటివరకు ఇంచార్జిగా ఉన్న కిమిడి నాగార్జునను ప్రక్కనపెట్టి ఉత్తరాంధ్రలో మరో బలమైన నేత గంటా శ్రీనివాసరావును బరిలోకి దింపాలని చూస్తుంది టిడిపి. ఎంపిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గంటాకు ఇప్పటివరకు ఓటమి తెలియదు. పోల్ మేనేజ్మెంట్లో దిట్ట. ఆర్థికంగా బలమైన నేత. అలాంటి గంటాను బొత్సపై పోటీకి దించితే చీపురుపల్లిలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తాయనే చెప్పాలి. గంటా చీపురుపల్లి నుండి పోటిచేయబోతున్నారనే వార్తలతో విజయనగరం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గంటా జిల్లా నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం ప్రక్క నియోజకవర్గాల్లో కూడా పడుతుందనేది టిడిపి మరో ఆలోచన. అలా ఓ వైపు బొత్సకు చెక్ పెట్టడంతో పాటు జిల్లాలో టిడిపి ప్రాబల్యం పెంచుకోవచ్చు అనే ఈక్వేషన్స్‌తో టిడిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఏదిఏమైనా అంతా అనుకున్నట్లే జరిగితే విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇదో కీలక మలుపు అనే చెప్పుకోవాలి.