Category : నేర | Sub Category : జాతీయ Posted on 2024-11-14 11:17:37
TWM News:-ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ నేతలకు తాకడంతో కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో పాటు.. మరో ఇద్దరు మాజీలకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్లగొండలో ప్రకంపనలను సృష్టిస్తోంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు కేవలం పోలీసు అధికారులే జైలుకు వెళ్లగా.. ఇప్పుడు నేతల వంతు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం.. ఇపుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలపై ఫోకస్ పెట్టిందట. ఇప్పటికే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందుకోగా, మరికొందరు గులాబీ నేతలకు నోటీసులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.పోలీసుల నెక్ట్స్ టార్గెట్ వీళ్లేనా..? పోలీసుల నోటీసులతో జిల్లాలోని మాజీలకు భయం పట్టుకుందా..? అన్న చర్చ మొదలైంది.
అధికారులంతా నల్లగొండ జిల్లాలో పని చేసిన వారే..!
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల సమయంలో జిల్లాకు చెందిన నేతల కదలికలను పసిగట్టేందుకు నల్లగొండలోనే వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు అధికారులు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన వారే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు 2015లో నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నల్లగొండలో ఓఎస్డి గా పని చేశారు. ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. డిఎస్పి ప్రణీత్ రావు.. ఎస్సైగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. సీఐ గట్టు మల్లు కూడా నల్గొండ జిల్లాలో పనిచేశారు.
మరికొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..?
ఏఎస్పీ తిరుపతన్నతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు నేతలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లింక్స్ ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈనెల 11వ తేదీన విచారణ హాజరు కావాలంటూ ఎనిమిదో తేదీన నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చారు. అనారోగ్య కారణాలతో నవంబర్ 14వ ఇవాళ హాజరవుతానంటూ చిరుమర్తి లింగయ్య చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ(నవంబర్ 14) విచారణను ఎదుర్కొంటానని, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానని లింగయ్య తెలిపారు. తనపై రాజకీయ కుట్రతోనే నోటీసులు ఇచ్చారన్న లింగయ్య, ఈ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ పనితీరును ఎండ గడున్నందుకే విమర్శిస్తున్నందుకే.. ప్రభుత్వం ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పోలీస్ అధికారులు పోస్టింగ్ ల కోసం, కార్యకర్తల అవసరాల కోసం తాను మాట్లాడడం సహజమే అన్నారు.