Category : నేర | Sub Category : జాతీయ Posted on 2024-11-14 10:51:11
TWM News:-ఓ అవినీతి జలగ అధికారుల ట్రాప్ లో ఇరుక్కుని ఊచలు లెక్కపెడుతున్నాడు. తన సర్వీస్ లో ఎందరో పేదలను బెదిరించి లంచాలు తీసుకుని అవినీతికి అలవాటు పడిన సదరు లంచగొండిని విజిలెన్స్ అధికారులు చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు..
బరేలీ, నవంబర్ 13: ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం షరా మామూలే. తాము అడిగినంత చేతిలో పెట్టకపోతే పనులు జరగవంటూ ఖరాఖండీగా చెబుతుంటారు. దీంతో చేసేదిలేక అమాయక ప్రజలు అవినీతి అధికారుల ఆకలి తీర్చేందుకు ఇల్లు, పొలం అమ్ముకుని గుళ్లవుతుంటారు. తాజాగా ఓ ప్రభుత్వ అధికారి ఇలాగే ఓ వ్యాక్తిని లంచం డిమాండ్ చేశాడు. కానీ తాను అంతసొమ్ము ఒకేసారి ఇచ్చుకోలేనని చెప్పడంతో.. సదరు అధికారి ఉందిగా.. వాయిదాల పద్ధతి అంటూ ఐడియా ఇచ్చాడు. దీంతో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సొమ్ము కట్టించుకుంటూ ఉండగా.. విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని మదర్సా మంజురియా అక్తరుల్ ఉలూమ్‌కు చెందిన ఆరిష్, రాజ్‌పురా నుంచి వసుంధర గ్రామానికి మదర్సాను తరలించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేశాడు. వక్ఫ్ సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఆసిఫ్ ఆ ఫైల్‌ను 6 నెలలుగా పెండింగ్‌లో పెట్టాడు. ఉన్నతాధికారుల వద్దకు ఆ ఫైల్ పంపేందుకు తనకు రూ.లక్ష లంచం కావాలని డిమాండ్ చేశాడు. అయితే ఒకేసారి అంత డబ్బు ఇవ్వలేనని ఆరిష్ తెలిపాడు.
దీంతో అధికారి మహ్మద్ ఆసిఫ్ వాయిదాల్లో లంచాన్ని చెల్లించాలని అతనికి సూచించాడు. దీంతో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆరిష్ ఆశ్రయించి తన గోడును వెళ్లగక్కాడు. ఈ నేపథ్యంలో అధికారి ఆసిఫ్‌ను రేలీలోని వికాస్ భవన్‌లో ఉన్న మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఒప్పందం ప్రకారం.. తొలి వాయిదా లంచం కింద రూ.18,000 తీసుకుంటుండగా అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.