Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-23 10:50:53
TWM News : ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని పేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 21 వేల మందికి తొలిదశలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకోని పట్టాలు మంజూరు కాని వారికి కూడా త్వరలోనే పట్టాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. గతంలో యరజర్ల దగ్గర 25 వేలమంది పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినటప్పటికీ.. ఆ భూముల్లో ఐరన్ ఓర్ ఉందంటూ కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. దీంతో పట్టాల పంపిణీని ఛాలెంజ్‌గా తీసుకున్న ఎమ్మెల్యే బాలినేని.. సీఎంని పట్టుబట్టి మరి 500 ఎకరాలను కొనుగోలు చేసేందుకు 230 కోట్లు మంజూరు చేయించుకున్నారు. ఒంగోలు పరిసరప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి ఇవాళ సీఎం చేతుల మీదుగా 21వేల మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నారు.
పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చేందుకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఒంగోలుకు బయలు దేరుతారు సీఎం జగన్. ఒంగోలులోని అగ్రహారం దగ్గరకు చేరుకోని.. జిల్లా నేతలతో ఇంటరాక్షన్ అవుతారు. ఇప్పటికే జిల్లా నేతలందరికి ఆహ్వానం పంపారు. అటు అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు సైతం ఆహ్వానం అందింది. ఇదే క్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైతం ఆహ్వానం అందింది. సీఎంతో భేటీకి, పట్టాల పంపిణీ కార్యక్రమానికి సిట్టింగ్ ఎంపీ మాగుంట వస్తారా? లేక డుమ్మా కొడతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే నెల్లూరుకి చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైపీసీకి రాజీనామా చేసినప్పటికీ.. మాగుంట మాత్రం సీటు విషయంలో అసంతృప్తిగా ఉన్నారు కానీ.. రాజీనామా మాత్రం చేయలేదు.
సీటు విషయంలో పలు మార్లు బాలినేని చేత సంప్రదింపులు జరిపినప్పటికీ సీఎం ససేమిరా అనడంతో కాస్తంతా కినుకగానే ఉన్నారు మాగుంట. సీట్లు రాని నేతలు ఈమధ్య కాలంలో రాజీనామాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అధిష్టానం సైతం తిరిగి పునరాలోచనలో పడింది. రాజీనామాలు చేస్తున్న నేతలను తిరిగి పార్టీలో కొనసాగాలని చెబుతున్నారు. ఇదే హామీ మాగుంటకు సైతం వస్తుందా? లేదా అనేది చూడాలి. మరోవైపు జిల్లాలో దర్శి, కనిగిరి, సంతనూతలపాడుతో పాటు మరికొన్ని చోట్ల అసంతృప్త నేతలు కనిపిస్తున్నారు. జిల్లా నేతలతో సీఎం భేటీ తర్వాత వీరందరికి ఎలాంటి హామీ వస్తుందనేది తెలియాల్సి ఉంది.