Responsive Header with Date and Time

రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం.. హైదరాబాద్‌ బీడీఎల్‌తో రష్యా కీలక ఒప్పందం!

Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-11-13 12:26:02


రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం.. హైదరాబాద్‌ బీడీఎల్‌తో రష్యా కీలక ఒప్పందం!

TWM News:-శత్రుదేశం ప్రయోగించే ఆయుధాలను ఆకాశం మధ్యలోనే నిర్వీర్యం చేసే డిఫెన్స్ సిస్టమ్స్‌ ను అభివృద్ది చేసేందుకు భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

ఏ దేశానికైనా రక్షణ వ్యవస్థలో శత్రుదేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన మారణాయుధాలు, క్షిపణులు, ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, యుద్ధ ట్యాంకులు సహా ఇంకా అనేక రకాల రక్షణ పరికరాలు అవసరమవుతాయి. వీటి అవసరం ఎంత ఉందో.. శత్రుదేశం ప్రయోగించే ఈ తరహా ఆయుధాలను మధ్యలోనే నిర్వీర్యం చేసే డిఫెన్స్ సిస్టమ్స్‌ అవసరం కూడా అంతే ఉంటుంది. అన్నింటిలో ఎయిర్ డిఫెన్స్ అన్నది అత్యంత కీలకమైన అంశం. ఈ విషయంలో ఏ దేశం పటిష్టంగా ఉంటుందో ఆ దేశాన్ని శత్రుదేశాలు ఏమీ చేయలేవు. ఇందుకు ఉదాహరణగా ఇజ్రాయిల్ దేశాన్ని చెప్పుకోవచ్చు.

అష్టదిక్కులా శత్రుదేశాలను కల్గిన అతి చిన్న దేశం ఇజ్రాయిల్. ఓవైపు పాలస్తీనా, మరోవైపు లెబనాన్, ఇంకోవైపు కాస్త దూరాన ఇరాన్, యెమెన్ దేశాలు ఏకకాలంలో ఆ దేశంపై క్షిపణులు, బాలిస్టిక్ మిస్సైళ్లు, రాకెట్ లాంచర్లతో విరుచుకుపడుతున్నా సరే.. ఆ దేశం వాటన్నింటినీ చాలా వరకు సమర్థవంతంగా మార్గమధ్యంలోనే నిర్వీర్యం చేస్తూ తమ భూభాగాన్ని కాపాడుకుంటోంది. అత్యంత పటిష్టమైన ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అందుకే ‘ఇరన్ డోమ్’గా వ్యవహరిస్తూ ఉంటారు. కనిపించని ఓ ఇనుప కవచం మాదిరిగా యావద్దేశాన్ని ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కాపాడుకుంటూ వస్తోంది కాబట్టి ఆ పేరు పెట్టారు.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే.. మన దేశం శరవేగంగా వృద్ధి పథంలో దూసుకెళ్తూ సూపర్ పవర్‌గా మారుతోంది. ఈ క్రమంలో రక్షణ రంగాన్ని నానాటికీ పటిష్టం చేసుకుంటూ అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అనేక దశాబ్దాలుగా ఈ తరహా అధునాతన ఆయుధ సంపత్తి కోసం ఇజ్రాయిల్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఆధారపడుతూ వస్తున్న భారత్, ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించేందుకు తహతహలాడుతోంది. ఈ క్రమంలో సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఒకెత్తయితే, ఇప్పటికే ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఆధునిక ఆయుధాలను భారత్‌లోనే తయారు చేసేలా ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. భారతదేశ అవసరాలు తీరిన తర్వాత మిత్రదేశాలకు ఆయుధ సంపత్తిని ఎగుమతి చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రష్యాతో హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సరికొత్త ఒప్పందం చేసుకుంది.

అందులో భాగంగా రష్యా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తున్న ఆయుధ ఎగుమతి సంస్థ రోసోబోరోనెక్స్‌పోర్ట్‌, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం గగనతల దాడుల నుంచి రక్షణ కల్పించే మొబైల్ యాంటీ మిస్సైల్ గన్ సిస్టమ్ పాంత్‌సిర్ ను భారత్‌లోనే తయారు చేసేందుకు రష్యా సాంకేతికతను సైతం బదిలీ చేస్తూ సహకరించనుంది. గోవాలో జరిగిన 5వ ఇండియా-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజిసి) సబ్‌గ్రూప్ మీటింగ్ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

పాంత్‌సిర్ ప్రత్యేకతలు

పాంత్‌సిర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వైమానిక దాడుల నుండి ఆర్మీ స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాలను రక్షించడానికి దోహదపడుతుంది. ఇది ఒక బహుముఖ మొబైల్ ప్లాట్‌ఫారమ్. ఇందులో ఎయిర్‌క్రాఫ్ట్, డ్రోన్‌లు, ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలు కూడా ఉంటాయి. అలాగే అధునాతన రాడార్, ట్రాకింగ్ వ్యవస్థను కూడా కలిగి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆటోమేటిక్ సర్ఫేస్-టు-ఎయిర్ (భూమ్మీద నుంచి గాల్లోకి) క్షిపణి, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌గా చెప్పవచ్చు. అంటే ఇది శత్రుదేశానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి ఈ వ్యవస్థను తయారు చేశారు. ఒక భారీ ట్రక్ వంటి వాహనంపై అమర్చిన వ్యవస్థ ద్వారా శత్రుదేశం ప్రయోగించిన మిస్సైళ్లు, యుద్ధ విమానాలను నేలపై నుంచే దాడి చేసి కూల్చివేయగలదు. ట్రక్‌పై ఏర్పాటై ఉంటుంది కాబట్టి ఆ వాహనాన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లి రక్షణ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

గగనతలం నుంచి జరిగే వైమానిక దాడుల నుండి ఈ వ్యవస్థ రక్షణ కల్పిస్తూ.. శత్రు క్షిపణులను, మానవరహిత వైమానిక వాహనాలను (యూఏవీ)లను కూడా కాల్చివేయగలదు. పాంత్‌సిర్ రెండు జంట 30 మిమీ ఫిరంగులు, 12 క్షిపణులను కలిగి ఉంటుంది. ఇవి 20 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణించగలవు. అలాగే 15 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న గగనతల లక్ష్యాలను ఛేదించగలవు. ఇందులో ఉన్న 12 ఘన ఇంధన క్షిపణులు సెకనుకు 1,300 మీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లి లక్ష్యాలను క్షణాల్లో ధ్వంసం చేస్తాయి.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: