Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : జిల్లా Posted on 2024-11-13 11:14:27
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : క్యాబినెట్ హోదా ఉన్న చీఫ్ విప్ పదవి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను వరించింది. పార్టీని నమ్ముకుని ఉంటూ కష్టకాలంలో శ్రేణులకు అండగా నిలిచిన జీవీకి సీఎం చంద్రబాబునాయుడు శాసనసభలో పెద్దపీట వేశారు. కీలక పదవి పల్నాడు జిల్లాకు దక్కడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
జీవీ ఆంజనేయులు స్వస్థలం వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఇనుమెళ్ల. పారిశ్రామికవేత్తగానున్న ఆయన శివశక్తి లీల, అంజన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. జన్మభూమి స్ఫూర్తితో చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీలో చేరారు. ఇప్పటికీ శివశక్తి ఫౌండేషన్తో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ ఫౌండేషన్లో ఇప్పటివరకు 48,526 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. 2004లో మొదటిసారిగా ఆయన భార్య లీలావతికి వినుకొండ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. తర్వాత వరుసగా 2009, 2014 ఎన్నికల్లో జీవీ ఆంజనేయులు వినుకొండ నుంచే వరుసగా గెలిచారు. 2019లో మాత్రం ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి వినుకొండ టీడీపీ కంచుకోట అని నిరూపించారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా 2014 నుంచి 2022 వరకు పని చేశారు. తర్వాత పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే టాప్టాన్లో వినుకొండ నియోజకవర్గాన్ని నిలబెట్టారు. రాజకీయంగా జిల్లాలో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలన్ని నిర్వహించారు. క్యాబినెట్ హోదా ఉన్న చీఫ్ విప్ పదవి దక్కడంపై పల్నాట తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
వినుకొండకు ఇది రెండోసారి
వినుకొండకు చీఫ్ విప్ పదవి వరించడం ఇది రెండోసారి. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన నన్నపనేని రాజకుమారికి చీఫ్ విప్ పదవి ఇచ్చారు. 1971లో పీవీ నరసింహారావు క్యాబినెట్లో వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన భవనం జయప్రద మంత్రిగా పని చేశారు. వినుకొండకు రాష్ట్రస్థాయి హోదా ఉన్న పదవి మరోమారు దక్కినట్లయింది.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
తనకు చీఫ్ విప్ గా గురుతర బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జీవీ ఆంజనేయులు ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారం అంటే ఆధిపత్యం చలాయించడం కాదని, నమ్మి గెలిపించిన ప్రజలకు సేవ చేయడమని కూటమి ప్రభుత్వం నిరూపిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనపై అధిష్ఠానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తోటి శాసనసభ్యులందరికీ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానన్నారు. శాసనసభ విలువలు, గౌరవం పెంచేందుకు కృషి చేస్తానన్నారు.