Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 11:08:18
TWM News:-కొంత మందికి విపరీతంగా ఆకలి వేస్తుంది.. కానీ కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో వారు ఆహారం సరిగ్గా తినలేక ఇబ్బంది పడిపోతుంటారు. ఈ లక్షణాలు మీలో కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇది ప్రాణాలను హరించే పెద్ద పేగు క్యాన్సర్ లక్షణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుందా? మీ సమాధానం అవును.. అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే నిరంతర మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెద్దప్రేగు లేదా కొలొరెక్టల్ క్యాన్సర్‌ను పెద్దప్రేగు క్యాన్సర్ అని కూడా అంటారు. ఈ క్యాన్సర్ పెద్ద ప్రేగు (పెద్దప్రేగు) లేదా పురీషనాళంలో సంభవిస్తుంది. ఇది జీర్ణాశయంలోని చివరి భాగం. చాలా మంది ఈ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను పెద్దగా పట్టించుకోరు. దీంతో అది ప్రాణాంతకం అవుతుంది. సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స కూడా సులువు అవుతుంది.
పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
బరువు కోల్పోవడం
మలంలో రక్తస్రావం
ఉదర విస్తరణ
బలహీనత
వాంతులు
అజీర్ణం
నిరంతర కడుపు నొప్పి
పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి.
ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూరగాయలు, తృణధాన్యాలు చేర్చుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.
మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు.
మంచినీరు, జ్యూస్‌లు వంటివి పుష్కలంగా త్రాగాలి.
మద్యం, డ్రగ్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
సిగరెట్, పొగాకుకు దూరంగా ఉండాలి.
పెద్దప్రేగు క్యాన్సర్‌కు చికిత్స ఏమిటి?
ఇతర క్యాన్సర్‌ల మాదిరిగా, పెద్దప్రేగు క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం అంత సులువుకాదు. దీనిని దాని లక్షణాల కారణంగా మాత్రమే గుర్తించడం జరుగుతుంది. వాస్తవానికి, చాలా మంది ఎసిడిటీ, గుండెల్లో మంట, అల్సరేటివ్ క్యాన్సర్ వంటి వ్యాధులకు ఇంటి నివారణలతో నయం చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో సకాలంలో చికిత్స అందక అది ప్రాణాంతకంగా మారుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ తరచుగా చివరి దశలో నిర్ధారణ అవుతుంది. వైద్యులు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీతో చికిత్స చేస్తారు. అవసరమైతే కణితిని తొలగించడానికి రోగికి శస్త్రచికిత్స కూడా నిర్వహిస్తారు. ఇందులో ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్ లను ఉపయోగిస్తారు.
నోట్: ఇక్కడ ఇచ్చిన విషయాలు సమాచారం కోసం మాత్రమే. ఏవైనా సందేహాలు ఉంటే, నిపుణులను సంప్రదించండి.