Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-13 11:00:46
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆదేశాలిచ్చారు. ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించినట్లైంది. 2023 జూన్ లో వైకాపా ప్రభుత్వ హయాంలోనే బోర్ల తవ్వకాల కోసం స్టేజ్-1 అనుమతులు మంజూరయ్యాయి. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం ఉందా, లేదా అన్నది నిర్ధారించడానికి గత ప్రభుత్వ హయాంలోనే కొన్నిచోట్ల తవ్వకాలు జరిపారు. నమూనాలు పరీక్షించగా, యురేనియం నిక్షేపాలున్నట్లు తేలింది. మరింత లోతైన పరిశోధన కోసం అటవీ ప్రాంతంలోని 468.25 హెక్టార్లలో 68 బోర్ హోల్స్ వేసి మట్టి నమూనాలను తీసి విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వ ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లోరేషన అండ్ రీసెర్చ్ (ఏఎండీ) నిర్ణయించింది. వారి తదుపరి కార్యాచరణను ఏఎండీ ఇటీవల విడుదల చేసింది. దీనిపై స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది.
వైకాపా దుష్ప్రచారం
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలకు అనుమతులు ఇవ్వకపోయినా, కొందరు వైకాపా నాయకులు టీడీపీ ప్రభుత్వమే తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందంటూ దుష్ప్రచారం చేశారు. ఈ విషయాన్ని మంత్రి టీజీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి వివరించారు. మంగళవారం మీడియా పాయింట్లోనూ మాట్లాడారు. స్పందించిన సీఎం.. కప్పట్రాళ్లలో భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రకటించారు. వాస్తవానికి ఎంఏడీ కోరిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్టేజ్-2 అనుమతులు ఇవ్వాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో తదుపరి తవ్వకాలకు బ్రేక్ పడినట్లైంది. బోర్హోల్స్ వేయడం నిలిచిపోనుంది. ఈ మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.