Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-13 10:49:12
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11నెలలు కావస్తోంది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది.. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణమాఫి లాంటివి అమలు చేసింది.. అంతేకాకుండా.. గ్రూప్ -1 పరీక్ష నిర్వహించడంతోపాటు.. డీఎస్సి నోటిఫికేషన్ వేసి 11వేల పై చిలుకు ఉపాధ్యాయ పోస్ట్ లు భర్తీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తోంది.. ఇదంతా బాగానే ఉన్నా.. అమలు అవుతున్న పథకాలను ప్రచారం చేయడంలో విఫలమవుతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జరుగుతుండటం .. చర్చనీయాంశంగా మారింది.. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అమలు చేసిన పథకాలను ప్రచారం చేయడంతో పాటు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు.. అలా తాము కూడా ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలే విస్మయం వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం..ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సోషల్ మీడియా వేదికగాను, బహిరంగంగా విమర్శల దండయాత్ర చేస్తున్నా.. కూడా కాంగ్రెస్‌లో బడా నేతలు మాకెందుకులే మమ్మల్ని కాదు కదా అన్నట్లు సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.. ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా కూడా ప్రభుత్వంలోని పెద్దలు ఎవ్వరూ వాళ్లని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.. కేవలం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క పొన్నం ప్రభాకర్, అప్పుడప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్ప మిగతా మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ స్పందించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.. ఇదే విషయం ఇప్పుడు గాంధీభవన్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్షాలకు ఒక్కడే ధీటుగా సమాధానం చెప్తున్నారు.. వేదికలపై కూడా ఆయన మాత్రమే గళం విప్పుతున్నారు.. విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తున్నారు. అయితే.. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనకు సంబంధించి ప్రతిపక్షాలు పనిగట్టుకుని దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇటు పార్టీపరంగా వారిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా.. సమర్ధవంతమైన విధంగా కౌంటర్ ఇవ్వడం లేదని చర్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలోనే.. ఇటీవల కాలంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టడంలో అట్టర్ ప్లాప్ అయిందని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం.. ఇదిలా ఉంటే త్వరలో జరిగే జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి..ఇప్పటికైనా ప్రతిపక్షాల విమర్శలను ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా సమర్థంగా ఎదుర్కొని కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీ లతోపాటు కులగణనను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకపోగలిగితే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని రాజకీయ విశ్లేషకులు, ఆపార్టీలోని పలువురు కీలక నేతలు చెప్తున్నారు. లేదంటే ప్రతిపక్షాలతో ఇబ్బందులు తప్పవని.. అదేవిధంగా రానున్న లోకల్ బాడీ ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నష్టపోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు..