Category : జాతీయ | Sub Category : తాజా వార్తలు Posted on 2024-11-13 10:40:08
ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో వారు పీహెచ్డీ చేశారంటూ దుయ్యబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రాపూర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, శివసే, ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మహారాష్ట్ర గత రెండున్నరేళ్లలో డబుల్ స్పీడ్‌తో అభివృద్ధి చెందిందన్నారు. అయితే అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రెండున్నర ఏళ్లలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడాన్ని ప్రజలంతా చూశారు. అత్యధిక విదేశీ పెట్టుబడులున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ గడ్డపై 12 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. 100 రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాం. నూతన విమానాశ్రయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి అని పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్డీ చేసింది. ఆదివాసీ కమ్యూనిటీని విచ్చిన్నం చేయాలని ఆ పార్టీ కోరుకుంటోంది. మీ ఐక్యతను నాశనం చేయాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) విదేశాల్లోనూ ఇదే విషయం చెబుతున్నారు. హస్తం పార్టీ కుట్రను భగ్నం చేసేందుకు మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అని మోదీ పిలుపునిచ్చారు.