Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-13 10:27:40
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలనలో మాత్రం పెద్దగా తేడా కనిపించట్లేదు. వైసీపీ అయినా, టీడీపీ అయినా పాలకులు వ్యవహరిస్తున్న తీరు ఒకేలా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు తావిచ్చింది. దీనిపై అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అనేక విమర్శలు చేశారు. మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ తప్పులను సరిదిద్ది సక్రమంగా పాలించాలి. కానీ అలా జరగట్లేదు. నాడు జగన్ చేసిన తప్పులనే ఇప్పుడు చంద్రబాబు కూడా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ గా చేసుకుని అనేక అసభ్యకర పోస్టులు పెట్టింది. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ను, వాళ్ల కుటుంబసభ్యులను కించపరుస్తూ అనేక పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అలా పెట్టొద్దని అప్పుడు చెప్పేవాళ్లెవరూ లేరు. తమపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని, చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేసినా వాటిని పట్టించుకోలేదు. కొంతమందిపై కేసులు నమోదైనా చర్యలు మాత్రం తీసుకోలేదు.
ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో తమపై తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్లపై పాలకులు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో వైసీపీ నెత్తీనోరూ బాదుకుంటోంది. తమ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని అరిచి గీపెడుతోంది. వైసీపీ నేతలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి అక్రమ కేసులు పెడుతున్నారని.. అడ్డుకోవాలని ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలను, వాళ్ల ఫిర్యాదులను పట్టించుకునే వాళ్లే లేరు.గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు, జనసేన నేతలు డీజీపీ లాంటి వాళ్లను కలిసి ఫిర్యాదులు చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ డీజీపీ ఎప్పడూ ఆపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. వైసీపీ నేతలకు అదే పరిస్థితి ఎదురవుతోంది. కాబట్టి అప్పుడు వైసీపీ వ్యవహరించిన తీరుగానే ఇప్పడు టీడీపీ, జనసేన వ్యవహరిస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ పెద్ద తేడా లేదు. రేపు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ కావడం ఖాయం. అప్పుడు వైసీపీ మళ్లీ టీడీపీ, జనసేన నేతలపై, కార్యకర్తలపై కేసులు పెడుతుంది. దీనికి అడ్డూఅదుపూ ఉండదు.