Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-13 10:11:24
ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నటరాజన్ చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. దివంగత రతన్ టాటా తన దార్శనిక నాయకత్వం, సహకారంతో మనదేశ పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేయడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రతన్ టాటా లెగసీని ముందుకు తీసుకెళ్లేలా నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు జరిగినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలక భాగస్వామిగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి కోసం టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ రాష్ట్రవ్యాప్తంగా 20 హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడిరచారు. తాజ్, వివంతా, గేట్‌వే, సెలెక్యూషన్స్, జింజర్ హోటల్ ఇలా 20 హోటళ్లతో పాటుగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచనలో టాటా గ్రూప్ ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. అలాగే 40 వేల కోట్ల పెట్టుబడితో టాటా వపర్, 5 గిగా వాట్ల సామర్థంతో సోలార్, విండ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.