Category : రాజకీయాలు | Sub Category : రాజకీయం Posted on 2024-11-12 15:40:16
TWM News:-రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలను ఏమాత్రం ఉపేక్షించేదీ లేదన్నారు హోంమంత్రి అనిత.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, నేరాల విషయంలో అధికారుల తీరుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయన వ్యాఖ్యలపై హోం మంత్రి అనితతోపాటు, ఇతర మంత్రులు స్పందించడం ఆసక్తిగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలను పాజిటివ్‌గా తీసుకుని, బాధ్యతగా పనిచేస్తానని అనిత అన్నారు. ఇప్పటికే అయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలను ఏమాత్రం ఉపేక్షి్ంచేదీ లేదన్నారు హోంమంత్రి అనిత. నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన బాధాకరమని, ఇలాంటి వారిపై గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేదీ కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరిలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బయట పడ్డారు.. మేము పడలేదు. లా అండ్ ఆర్డర్ పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
ఈ ఘోరాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులు కావాలన్న హోంమంత్రి, ఈ అంశాలంటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి హెచ్చరించారు. భావప్రకటన స్వేచ్ఛ పేరిట కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఆవేదనతో అలా మాట్లాడారని అనిత వివరించారు. అంతేకాదు, తాను సోషల్ మీడియా బాధితురాలినే అన్నారు హోంమంత్రి అనిత.
ఇదిలావుంటే, నిన్న పిఠాపురం పర్యటనలో రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దీనికి హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు పవన్.