Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-11-12 15:39:16
TWM News:-దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గేట్ 2025 ప్రవేశ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. రోజుకు 2 సెషన్ల చొప్పున మొత్తం 4 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏ సబ్జెక్ట్ పరీక్ష ఎప్పుడు ఉంటుందో ఇక్కడ చెక్ చేసుకోండి..
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2025 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. తాజాగా సబ్జెక్ట్ వైజ్ పేపర్ల వారీగా గేట్ పరీక్ష పూర్తి షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం.. గేట్ పరీక్షలను వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 4 రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి.
కాగా గేట్ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 11వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఫలితాలు మార్చి 19వ తేదీన విడుదల చేస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 2వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. గేట్ స్కోర్ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో ఎమ్‌టెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కూడా గేట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన గేట్ ప్రవేశపరీక్షకు ప్రతీ యేటా లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు సాధారణంగా ఈ పరీక్షకు హాజరవుతుంటారు.
ఈ పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి ఉండదు. గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్ధులకు నెలకు రూ.12,400ల చొప్పున స్కాలర్‌షిప్ అందజేస్తారు. ఇక ఐఐటీల్లో అయితే గేట్ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు కల్పిస్తాయి.