Category : | Sub Category : నేర Posted on 2024-02-21 10:39:49
TWM News : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో డ్రైవ్ చేస్తున్న కారు డ్రైవర్ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు రైతులు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి చెందగా.. ఆటో డ్రైవర్ షేక్ ఖాశీంషా, కారులో ప్రయాణిస్తోన్న బైనగాని ఓబయ్య, గురవయ్య తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలంలోని బార్లకుంటకు చెందిన చిత్తారు వెంకటేశ్వర్లు (53), చిత్తారు రాములు (40), బిళ్ల చిన్నవెంకటేశ్వర నాయుడు కలిసి ఎండుమిర్చి పంటను అమ్ముకునేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారు. విక్రయించిన సొమ్ము తీసుకుని, గుంటూరులో రైలు ఎక్కారు. వీరు కంభంలో దిగాల్సి ఉంది. అయితే నిద్రపోవడంతో వారు దిగాల్సిన స్టేషన్ దాటి పోయింది. దీంతో గిద్దలూరులో దిగారు. అక్కడ నుంచి బేస్తవారిపేటకు వచ్చేందుకు ఆటో ఎక్కారు.
మరోవైపు విజయవాడలో తండ్రీకొడుకులు ఓబయ్య, గురవయ్య కొత్త కారును కొనుగోలు చేశారు. వీరు కారులో వెళుతూ ఉండగా పూసలపాడు వద్ద నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అందులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వీరిలో వెంకటేశ్వర్లును రోడ్డుపై వెళ్లే వాహనదారులు బయటకు తీశారు. రాములు, చినవెంకటేశ్వర నాయుడు ఆటోలో చిక్కుకుపోయారు.
ఇంతలో ఆటోలోని ఆయిల్ ట్యాంక్ లీకై ఆటోకు మంటలు వ్యాపించాయి. దీంతో ఆటోలో ఇరుక్కుపోయిన రాములు, చినవెంకటేశ్వర నాయుడు మృతదేహాలు మంటల్లో కాలిపోయాయి. వారి వద్ద ఉన్న మిర్చి పంట విక్రయించగా వచ్చిన సొమ్ము రూ.10లక్షలు కూడా కాలి బూడిదైపోయాయి. మృతుడు చిన్న వెంకటేశ్వర నాయుడు సీఎస్‌పురం మండలం, నల్లమడుగుల సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో మూడు కుటుంబాల్లో అంతులేని విషాదం నిండింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు.