Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-12 14:41:34
TWM News:-నానబెట్టిన బాదంపప్పులు తింటే ఏం జరుగుతుంది? నానబెట్టిన బాదం పొద్దునే తింటే కలిగే ఆరోగ్యకరమైన లాభాలు ఏంటి? బాదం పప్పుల్లో ఇంతకీ ఏం ఉంటాయి?
అధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా బాదం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రియమైన గింజలలో ఒకటికి మారింది. ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. మనం పొద్దున్నే లేవగానే నానబెట్టిన బాదం పప్పులను పొట్టు తీసి తింటుంటాం. చాలా మంది డైటీషీయన్లు బాదంపప్పులు తినాలని మనకు సూచిస్తుంటారు. నానబెట్టిన బాదంపప్పులు పొద్దునే తింటే కలిగే ఆరోగ్యకరమైన లాభాలేంటో చూద్దాం..
నానబెట్టిన బాదంపప్పులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బాదం పప్పులు జీర్ణక్రియకు కావాల్సిన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సాయపడుతాయి. మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు అని పలువురు నిపుణులు అంటున్నారు. నానబెట్టిన బాదం పప్పుల్లో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ, చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తాయి. ఆరోగ్యకరమైన గుండె పనితీరుకు డైటీషియన్లు నానబెట్టిన బాదం పప్పులు తినాలని సూచిస్తారు. ఇక బరువు తగ్గాలని అనుకునేవారికి కూడా ఇవి బెటరే అని చెప్పవచ్చు. బాదం పప్పుల్లో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మన పొట్ట నిండుగా అనిపించడంతో ఆకలి అనిపించదు. దీంతో అనవసరమైన ఆహారం తీసుకోకుండా నియంత్రించవచ్చు. ఈ నేపథ్యంలో బరువు కంట్రోల్‌లో ఉంటుంది. నానబెట్టిన బాదంపప్పుల్లో విటమిన్ ఇ, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యకరంగా ప్రకాశవంతంగా ఉంచుతాయి. గుప్పెడు బాదంపప్పులు రాత్రిపూట నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున పొట్టు తీసి తింటే ఎంతో ఆరోగ్యమని, చిన్న పిల్లలకైతే 3 నుంచి 4 బాదం పప్పులు తీసుకుంటే చాలు అని నిపుణులు సూచిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)