Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-11-12 11:07:53
TWM News : పాన్ ఇండియా సినీప్రియులు ఎక్కువగా అభిమానించే నటి సాయి పల్లవి. తెలుగు, మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించి అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఓవైపు అద్భుతమైన నటన.. మరోవైపు కళ్లు తిప్పుకోనివ్వని డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సాయి పల్లవికి స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న అభిమానగణం గురించి చెప్పక్కర్లేదు. ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. కంటెంట్, నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెను అభిమానులు ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇటీవలే అమరన్ సినిమాతో మరోసారి అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఇందులో ఇందు రెబికా వర్గీస్ పాత్రలో మరోసారి అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. మరోవైపు రామాయణం సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి ఓ సినిమా షూటింగ్ లో తాను ఎదుర్కొన్న కష్టాలు, మానిసిక ఒత్తిడి గురించి చెప్పుకొచ్చింది.
గలాటా ప్లస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ ఒకరోజు పూర్తైనా ఎంతో సంతోషించేదాన్ని. ఎందుకంటే నాకు రాత్రిళ్లు షూట్ చేయడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నిద్రలేకపోతే నేను త్వరగా అలసిపోతాను. కానీ శ్యామ్ సింగరాయ్ సినిమాకు కంటిన్యూగా రాత్రిళ్లు షూటింగ్ జరిగింది. దీంతో నాకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాగే షెడ్యూల్స్ వల్ల మానసికంగానూ, శారీరకంగానూ చాలా అలసిపోయాను. దాదాపు ముప్పై రోజులపాటు కంటిన్యూగా షూటింగ్ జరిగింది. పనిభారం, అలసటతో చాలా నీరసించి పోయాను. దీంతో షూటింగ్ సెట్ లో ఏడ్చేశాను.. కానీ నాకు ఆ సినిమాలో నటించాలని ఉండేది. ఒక్కరోజైనా సెలవు ఉండే బాగుండు అని కోరుకున్నాను. కానీ నేనెప్పుడు ఏ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. నేను ఏడుస్తున్నప్పుడు మా చెల్లెలు చూసింది. దీంతో నేరుగా నిర్మాత దగ్గరకు వెళ్లి తను ఏడుస్తుంది. ఒకరోజు సెలవు కావాలని అడిగింది. దీంతో విషయం తెలుసుకున్నా నిర్మాత సెట్స్ లో ఉన్నవారు 10 రోజులు సెలవు తీసుకుని అన్నీ సర్దుకున్నాక తిరిగి రావాలని చెప్పారు” అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకుంది సాయిపల్లవి.
ఇటీవలే అమరన్ సినిమాతో హిట్టు కొట్టింది సాయి పల్లవి. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ హీరోగా నటించగా.. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. మరోవైపు తెలుగులో నాగచైతన్య సరసన తండేల్.. హిందీలో రామాయణం చిత్రాల్లో నటిస్తుంది.