తుది అంకానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?
Category : రాజకీయాలు |
Sub Category : రాజకీయం Posted on 2024-11-11 17:42:49
TWM News:-
అమెరికా ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ మూడు రకాలుగా సాగుతుంది. బ్యాలట్ పేపర్లు, బ్యాలట్ మార్కింగ్ డివైస్‌లు, డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో ఓటింగ్ జరుగుతుంది.
నాలుగేళ్లకి ఓసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది అంకం ప్రారంభం కాబోతోంది. ఈరోజు అంటే మంగళవారం(నవంబర్ 5) అమెరికా వ్యాప్తంగా జరిగే ఓటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఆరుగురు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం ఇద్దరి మధ్యే ఉంది. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలో దిగుతున్నారు. ఇండిపెండెంట్లుగా మరో నలుగురు ఉన్నా.. వారి పేరు రేసులో వినిపించడం లేదు.
అన్ని రాష్ట్రాల్లోనూ వారి వారి కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మొదలవుతుంది. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే పార్టీలు విస్త్రృత ప్రచారం చేశాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలప్రక్రియ ఎలా సాగబోతోంది?
భారత్ లాంటి దేశాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి.. కాని అమెరికాలో ఎలక్షన్ సిస్టమ్ వేరుగా ఉంటుంది. అక్కడ అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ ఉన్నా.. అది పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. మిగిలిన ప్రక్రియ రాష్ట్రాల చేతిలో ఉంటుంది. ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక ఎలక్షన్ రెగ్యులేటరీ ఉంటుంది. బ్యాలట్ పేపర్ డిజైన్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏరాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే అమెరికా ఎలక్షన్ ప్రాసెస్ క్లిష్టంగా.. రోజుల తరబడి సాగుతుంది.