Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-11 14:49:49
TWM News:- తిరుపతి జిల్లాలో దొంగ నోట్ల ముద్రణ వెలుగు చూసింది. గత కొంత కాలంగా తిరుపతి చెర్లోపల్లి సర్కిల్ లోని ఒక ఇంట్లో ఫేక్ నోట్స్ ప్రింటింగ్ జరుగుతున్నట్లు తేలిపోయింది. పుత్తూరులో వెలుగు చూసిన ఫేక్ కరెన్సీ వ్యవహారం ఈ దందాను బయట పెట్టింది.
తిరుపతి జిల్లాలోని పుత్తూరులో పలు దుకాణాల్లో ఫేక్ కరెన్సీ చలామణి అయినట్లు గుర్తించిన పోలీసులు కూపీ లాగడంతో బయట కొచ్చింది. నకిలీ నోట్లను కరెన్సీ కౌంటింగ్ మిషన్ గుర్తించింది. పుత్తూరు లో పలు దుకాణాల్లో నొట్ల లెక్కింపు సమయంలో దొంగ నోట్లను షాప్ యజమానులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయా దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ పుట్టేజీ ఆధారంగా దొంగ నోట్లు చలామణి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు తిరుపతి లోని చెర్లోపల్లి సర్కిల్ లో నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించారు.
చెర్లోపల్లిలో ఉంటున్న రమేష్ ఇంట్లో ఫేక్ కరెన్సీ ముద్రించినట్లు నిర్ధారించుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముని కృష్ణారావు సహకారం తో దొంగ నోట్ల ను ముద్రించింది రమేష్ ఫ్యామిలీ. షేర్ మార్కెట్ లో నష్టాలను చవి చూసిన రమేష్, ముని కృష్ణారావు సహకారంతో ఈజీ మనీ కోసం ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లు ముద్రించారు.