Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2024-11-11 12:50:32
TWM News:యువకులను ఉద్యోగాల పేరిట విదేశాలకు రప్పించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న మాఫియా ముఠాల దందాలు బయటపడుతూనే ఉన్నాయి. మయన్మార్, కంబోడియాల్లో దారుణాలు ఇప్పటికే వెలుగులోకి రాగా.. తాజాగా ఓ ముఠా తెలంగాణకు చెందిన నలుగురు యువకులను లావోస్ దేశానికి రప్పించి నేరాలు చేయించేందుకు ప్రయత్నించింది. వారి శిబిరంలో బందీలైన బాధితులు ఎలాగోలా ఇక్కడికి వచ్చి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ)కి ఫిర్యాదు చేయడంతో అక్కడి దందా బహిర్గతమైంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన అనిల్కుమార్(27), మహేశ్(29), అదే మండలంలోని అల్లీపూర్కు చెందిన ప్రవీణ్కుమార్(33), జిల్లాకేంద్రం హనుమాన్వాడకు చెందిన మోహన్(21)కు లావోస్లో ఉద్యోగమిప్పిస్తానంటూ సింగరావుపేటకు చెందిన గాజర్ల వంశీ ఆశ చూపాడు. ఆఫీస్ సిస్టమ్ వర్క్ చేస్తే మొదటి రెండు నెలలు రూ.70వేల చొప్పున.. తర్వాత నెలకు రూ.40వేల చొప్పున వేతనముంటుందని నమ్మించాడు. అలా మధ్యవర్తి పాలకుర్తి సురేశ్ సమక్షంలో ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల చొప్పున వసూలు చేశాడు. విజిట్ వీసాపై బ్యాంకాక్ వెళ్లాలని.. అక్కడ ఏజెంట్ రాజశేఖర్ అలియాస్ రోమన్ మిమ్మల్ని లావోస్కు తీసుకెళతాడని.. కంపెనీ వీసా ఇప్పించి ఉద్యోగంలో చేర్పిస్తాడని చెప్పాడు. దీంతో నలుగురు సెప్టెంబరు 30న బ్యాంకాక్ వెళ్లారు. అక్కడ రాజశేఖర్ స్పందించకపోవడంతో సొంత ఖర్చులు పెట్టుకొని లావోస్ చేరుకున్నారు.
అంగీకరించకపోవడంతో చిత్రహింసలు..అక్కడ కంపెనీ వీసా లేకపోగా.. అదో సైబర్నేరాల మాఫియా కంపెనీ అని యువకులకు అర్థమైంది. యువకులను అమ్మాయి గొంతుతో మాట్లాడిస్తున్నారు. అమ్మాయి మొహంతో నకిలీ ఐడీని సృష్టించి ఇవ్వగా దాని సాయంతో అమెరికన్లతో చాటింగ్, ఫోన్కాల్స్ చేయిస్తున్నట్లు అర్థమైంది. మరోవైపు ముఠాకు చెందిన హ్యాకర్లు బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తుండటాన్ని గమనించారు. దీంతో కంపెనీతో ఒప్పందపత్రంపై సంతకాలు చేసేందుకు నలుగురూ నిరాకరించారు. ఆగ్రహించిన ముఠాసభ్యులు వారిని చీకటిగదుల్లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. రోమన్, వంశీ సైతం ఫోన్లు చేస్తూ ముఠా చెప్పినట్లు చేయాలంటూ బెదిరించారు. వారి దీనావస్థను చూసి అక్కడే ఉన్న కొందరు యువకులు బయట పడేందుకు సహకరించారు. దీంతో గత నెలలో భారత్కు తిరిగివచ్చిన బాధితులు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.