Category : నేర | Sub Category : జాతీయ Posted on 2024-11-11 12:19:44
TWM News:ఓ యువకుడు 150 అడుగులకు పైగా ఎత్తైన విద్యుత్ స్తంభాన్ని ఎక్కడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. హైటెన్షన్ వైర్ల ద్వారా హై పవర్ వెళుతుండగా, ఎవరో యువకుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని కిందకు దిగాలని కోరుతూ స్తంభం చుట్టూ భారీగా జనం గుమిగూడారు. అతన్ని వెంటనే కిందకు దిగాలంటూ అందరూ అరుపులు కేకలు పెట్టారు. అంతలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. పోలీసుల్ని చూసిన ఆ యువకుడు కిందకు దిగకుండా అక్కడే వింతగా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ నోయిడాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కేసు నోయిడా సెక్టార్ 76కి చెందినదిగా తెలిసింది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఓ యువకుడు హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కుతుండగా స్థానికకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకునేలోపే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మెట్రో లైన్ కింద ప్రజలు ఆగి యువకుడి వీడియోలు తీయడం ప్రారంభించారు. వీటన్నింటితో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది.