Category : నేర | Sub Category : జాతీయ Posted on 2024-11-11 11:54:14
TWM News:నిర్మల్ జిల్లాలో బెబ్బులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పది రోజులుగా పది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన బెబ్బులి సరిహద్దు దాటినట్టే దాటి మళ్లీ తిరిగొచ్చింది. సారంగపూర్ , నర్సపూర్ , కుంటాల మండలాల ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. పశువుల మంద మీద దాడి చేసి మూడు పశువులను హతమార్చింది. పులి దాడి నేపథ్యంలో అలర్ట్ అయిన అటవిశాఖ ట్రాప్ కెమెరాలతో నిఘా పెంచింది. ఎప్పుడు ఎటు వైపు నుండి వచ్చి దాడి చేస్తుందో తెలియక పశువుల కాపారులు, రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే వలస వచ్చిన పులిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అటవిశాఖ చెమటోడుస్తోంది.
నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ , కుంటాల, నర్సాపూర్ మండలాల పరిదిలో సంచరిస్తున్న బెబ్బులి పదికి పైగా గ్రామాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. జిల్లాలో ని మూడు మండలాల ప్రజలను మూడు వారాలుగా ముప్పు తిప్పలు పెట్టిన బెబ్బులి.. బైంసా డివిజన్ రేంజ్ లోని సూర్యపూర్ నుండి బార్డర్ దాటి మహారాష్ట్ర అప్పారావ్ పేట్ పారెస్ట్ లోకి వెళ్లిపోయింది. అమ్మయ్యా బెబ్బులి టెన్షన్ తప్పిందని మూడు మండలాల జనం ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ నేనొచ్చాశానంటూ పాదముద్రలతో కబురంపింది బెబ్బులి.మహారాష్ట్ర సరిహద్దుకు వంద మీటర్ల దూరం లోని అప్పారావుపేట్ బీట్ పరిధి వైపు గురువారం ఆనవాళ్లు కనిపించడంతో.. ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటే వీలుందని ఇక్కడి అధికారులు మహారాష్ట్ర ఎస్ఆర్వో, అధికారు లకు పులి సంరక్షణ బాధ్యతలను అప్పగించేందుకు నివేదికలు రూపొందించారు. హమ్మయ్య పులి వెళ్లిందని ఊపిరిపీల్చుకున్న తరుణంలో శుక్రవారం మళ్లీ కుంటాల, హన్మాన్ నగర్ తండా ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది బెబ్బులి. ఈ బెబ్బులి వయస్సు 6 ఏళ్ల పైగానే ఉంటుందని.. మహారాష్ట్రాలోని పెనుగంగా టైగర్ జోన్ లో సంచరించే జాని టైగర్ గా గుర్తించామని తెలిపారు బైంసా ఎఫ్ఆర్వో వేణుగోపాల్. మహారాష్ట్ర లోకి వెళ్లి పోయి మళ్లీ బైంసా డివిజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెబ్బులి హన్మాన్ తండా మీదుగా ప్రాథమిక పాఠశాల వెనక వైపు నుంచి అడవిలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు పేర్కొన్నారు ఎఫ్ఆర్వో. అడవంతా నాదే అన్నట్టుగా బైంసా డివిజన్ లోని అటవి ప్రాంతంలో బెబ్బులి సంచారం కొనసాగుతోంది. నర్సాపూర్ ( జి ) అడవుల్లో ఆరు బృందాలు , 15 ట్రాప్ కెమెరాలతో టైగర్ కోసం సేవ్ టైగర్ ఆపరేషన్ కొనసాగిస్తోంది అటవిశాఖ.