Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-11 10:05:14
TWM News:-
బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏడాది కిందట కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని.. కానీ ఇప్పటివరకు అందులో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో ఎవరికీ స్పష్టత లేదని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సర్వే చేపట్టారని ఆరోపించారు.
ఏం సాధించిందని కాంగ్రెస్ ప్రభుత్వం వారోత్సవాలు జరపాలనుకుంటోందని ప్రశ్నించారు కేటీఆర్. తాము కూడా కాంగ్రెస్ వైఫల్యాల వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. మరోవైపు మహారాష్ట్రకు డబ్బులు పంపించే పనిలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారని ఆరోపించారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీష్‌రావు. రుణమాఫీపై మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే అని.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు గ్యారేజ్‌కు పోయాయని విమర్శించారు. రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే.. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే దాకా తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని.. వారి బెదిరింపులకు భయపడేది లేదని బీఆర్ఎస్ నేతలు మరోసారి స్పష్టం చేశారు.