Category : నేర | Sub Category : ఆంధ్రప్రదేశ్ Posted on 2024-11-09 12:29:50
TWM News:డిగ్రీ చదువుకున్నాడు.. కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వచ్చిన దానితో తృప్తి చెందలేదు.. అడ్డదారిలో సొమ్ము సంపాదించుకోవలనుకున్నాడు. వివిధ ప్రాంతాలకు వచ్చి రెక్కీ నిర్వహిస్తుంటాడు. అర్ధరాత్రి వేళలో స్కెచ్ వేసి చోరీ చేస్తాడు. అయితే అసలు కష్టపడడు.. అషామాషీగా చోరీ చేయడు.. బీరువా తాళాలుంటే చక్కగా ఓపెన్ చేసి అందినంత దోచుకుని తిరిగి తాళం వేసి వెళ్ళిపోతాడు. లేదంటే మరొక ఇంటికి వెళతాడు.. ఇది ఈ దొంగగాడి స్పెషల్..! తెనాలిలో చేసిన ఐదు చోరీలు ఇదే తరహాలో ఉండటంతో పోలీసులు సైతం విస్తుపోతున్నారు.విజయవాడకు చెందిన హరీష్ కుమార్ డిగ్రీ వరకూ చదువుకున్నాడు. తర్వాత కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే జల్సాలకు అలవాటు పడి, ఈజీ మని కోసం చోరీలు చేయడం మొదలు పెట్టాడు. ఏడాది క్రితం తెనాలిలోని బాలాజీరావుపేటకు కారు బాడిగకు వచ్చాడు. ఆ ఏరియాలో రెక్కీ నిర్వహించాడు. రైల్వే ట్రాక్ పక్కనే బాలాజీరావుపేట ఉండటంతో చోరీలు చేసేందుకు అనుకూలంగా ఉంటుందని భావించాడు. పగలంతా కారు డ్రైవర్ గా పనిచేసి రాత్రి సమయంలో ట్రెయిన్‌లో ప్రయాణించి, తెనాలి చేరుకునేవాడు.
రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న బాలాజీరావుపేట చేరుకునేవాడు. అర్ధరాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇంటిలోకి చొరబడేవాడు. బీరువా తాళాలు, అల్మరా తాళాలు అందుబాటులో ఉంటే వాటిని తెరిచి బంగారు ఆభరణాలు దోచుకునే వాడు. వాటిని విజయవాడ తీసుకెళ్లి విక్రయించి వచ్చిన డబ్బులు తీసుకుని గోవా వెళ్లి జల్సాలు చేసేవాడు. డబ్బులు అయిపోగానే, తిరిగి విజయవాడ వచ్చి కారు డ్రైవర్‌గా పనిచేస్తూ రెక్కీ నిర్వహించేవాడు.అయితే బీరువాలు, ఆల్మరాలు పగులకొట్టి ఉండకపోవడంతో హరీష్ పట్టుకోవడం పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. సాంకేతికతను ఉపయోగించి ఎట్టకేలకు హరీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే అతను చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. తాళాలు అందుబాటులో లేకుంటే చోరీ చేయనని హరీష్ తెలిపాడు. తెనాలిలో చేసిన ఐదు చోరీలు ఇదే తరహాలో ఉండటంతో పోలీసులు హరీష్ చెప్పింది కరెక్టేనని నిర్ధారించుకున్నారు.హరీష్ వద్ద నుండి వంద గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మరొక 120 గ్రాముల బంగారు ఆభరణాలు ఎక్కడ తాకట్టు పెట్టాడో తేల్చే పనిలో పడ్డారు. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టుకున్న వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.