Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-17 11:09:38
TWM News : తెలంగాణలో హెచ్ఎండీఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్నులు చెల్లించే విషయంలో ఫేక్ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండీఏలో తొమ్మిదేళ్లుగా చక్రం తిప్పారు శివబాలకృష్ణ. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టు చూపిస్తూ ఫేక్ సంస్థలు ఏర్పాటు చేశారు. సౌందర్య బోటిక్, శారి వర్క్స్ పేరుతో ఐటి రిటర్న్స్ దాఖలు చేశారు. ఆర్ధిక ఆదాయాన్ని చూపేందుకు వీరి పేర్ల పై వ్యాపారాలు ఉన్నట్టు సృష్టించి పన్ను ఎగవేతకు కారణం అయ్యారు. ఈ షేల్ కంపెనీల ద్వారా కుటుంబ సభ్యుల పేరుతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు శివబాలకృష్ణ.
తన కూతురు పద్మావతికి కూడా ఆదాయం వస్తుందని చూపించారు. హోమ్ ట్యూషన్స్ ద్వారా వచ్చిన అదాయంతో ఐటీ రిటర్న్ ఫైల్ చేసినట్టు సృష్టించారు. అక్రమ సంపాదనను కవర్ చేసేందుకు ఈ షేల్ కంపెనీల పేరుతో ఆదాయం వచ్చినట్టు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఏసీబీ అధికారుల వలకు చిక్కి కస్టడీ అనుభవిస్తున్నారు. HMDA లో ప్లానింగ్ డైరక్టర్‌గా శివబాలకృష్ణ ఉన్న సమయంలో బిల్డర్లకు, రియల్టర్లకు, ఇన్‌ఫ్రా ఓనర్లకు, ల్యాండ్ వెంచర్ల యజమానుల ఫైల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని, సత్యనారాయణ, భరత్ ఇద్దరు శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకెన్ని పరిణామాలు వెలుగులోకి వస్తాయో అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది.