Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-16 10:41:14
TWM News :- సీఎం జగన్ అనంతపురం రాప్తాడు జిల్లా పర్యటనకు సర్వం సిద్దం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలైన సీఎం జగన్ ప్రచారాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. టీడీపీ, జనసేనల మధ్య పొత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదే క్రమంలో సీఎం జగన్ తన ఎన్నికల శంఖారావాన్ని పూరించేశారు. ఇప్పటికే 6 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల తరువాత మరికొందరిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాప్తాడులో సీఎం సిద్ధం సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్.. సిద్ధం సభలతో కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.
ఇప్పటికే విశాఖ, దెందులూరులో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. అయితే ఈనెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దెందులూరు సిద్ధం సభలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు అనంతపురం జిల్లా పోలీసులు. సీఎం జగన్ నడుచుకుంటూ వెళ్లే ర్యాంప్, గ్యాలరీలకు మధ్య దూరాన్ని పెంచారు పోలీసులు. దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్.. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళుతున్న సమయంలో ర్యాంప్ పైకి అభిమానులు, కార్యకర్తలు దూసుకొచ్చారు. ఓ అభిమానైతే అత్యూత్సాహంతో ర్యాంప్‌పైకి దూసుకెళ్లాడు. సీఎం జగన్‌ను హగ్ చేసుకున్నాడు.
ఆ అభిమాని చేసిన పనికి ఒక్కసారిగా సీఎం సెక్యూరిటీ కంగుతినింది. దీంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది పటిష్ఠమై చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే.. సీఎం జగన్ నడుచుకుంటూ వెళ్లే ర్యాంప్ నకి, గ్యాలరీలకు మధ్య మరో రెండు ఫుట్ పాత్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు జిల్లా ఎస్పీ అన్బురాజన్. సీఎం నడిచే ర్యాంప్ నకి ఇరువైపులా ఒక ఫుడ్ పాత్‌పై సీఎం సెక్యూరిటీ.. ఆ తర్వాత మరో ఫుట్ పాత్‌పై స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రత ఏర్పాటు చేస్తున్నారు.