Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-15 10:32:17
TWM News :- మేడిగడ్డ ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల బృందం పర్యటన అనంతరం మాటల తూటాలు పేలుతున్నాయి. కుంగిపోయిన మేడిగడ్డలో నీళ్లు ఎలా నింపుతారో బీఆర్‌ఎస్ నేతలు వచ్చి చెప్పాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు.. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయడం సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని.. సీఎం రేవంత్ కి చేయడం చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలని సూచించారు. ఆయన రాజీనామా చేస్తే.. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేస్తానని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బురద రాజకీయాలు మాని మేడిగడ్డ పునరుర్ధరణ పై దృష్టిపెట్టాలని హరీష్ రావు హితవు పలికారు.
మేడిగడ్డతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయిందనేలా కాంగ్రెస్ మాట్లాడుతోంది.. లోక్ సభ ఎన్నికల్లో లబ్ధికోసం కాంగ్రెస్ వరద, బురద రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని అని.. తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల పెరుగుదల కాళేశ్వరం ఫలితమే అన్నారు హరీష్. మేడిగడ్డ ఘటనలో సమగ్ర విచారణ చేసి..దోషులను శిక్షించాలని అసెంబ్లీలో చెప్పామని.. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా.. రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు.