Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-11-06 12:35:01
TWM News:-ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలను తన నీతి శాస్త్రంలో బోధించాడు.. క్షుణ్ణంగా వివరించాడు.. వ్యక్తిగత జీవితం నుంచి వైవాహిక జీవితం, వృత్తి, ఆరోగ్యం, ఉద్యోగానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్య నీతి శాస్త్రంలో బోధించాడు. అయితే.. సాయం గురించి కూడా చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పాడు.. కొన్నిసార్లు మీరు చేసే సహాయం ఇతరులకు ప్రయోజనం కలిగించదన్నాడు.. ఇంకా మీ జీవితానికే హాని తలపెడుతుందని వివరించాడు..
ఎవరికైనా సహాయం చేయడాన్ని పుణ్య కార్యంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి ఇతరులకు సహాయం చేయడం ఆదర్శ వ్యక్తిత్వానికి సంకేతం. కానీ.. కొన్నిసార్లు మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటారు.. కానీ పరిస్థితులు సరిగ్గా ఉండవు.. అప్పుడు వారు మీ నిస్సహాయతను అర్థం చేసుకుంటారు.. మీ మంచి ఉద్దేశాలను గ్రహిస్తారు. అయితే.. కొన్నిసార్లు మీ సహాయం అవతలి వ్యక్తికి ప్రయోజనం కలిగించదు. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేసే సమయంలో ముందుగా వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలని.. ఆచార్య చాణక్యుడు బోధించాడు.. ముఖ్యంగా, ఈ మూడు రకాల వ్యక్తులకు సాయం చేయడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లేనని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.
దుర్భుద్ది - సంస్కారం లేని స్త్రీలకు సహాయం: మంచి వ్యక్తిత్వం లేని స్త్రీని వివాహం చేసుకోవడం వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుందని చాణక్యుడు చెప్పాడు. కాబట్టి అలాంటి స్త్రీని ఎప్పుడూ పెళ్లి చేసుకోకండి. దుర్భుద్ది, మంచి వ్యక్తిత్వం లేని స్త్రీలు భర్త కుటుంబ పురోగతికి ఆటంకం కలిగిస్తారు. కాబట్టి మీ జీవిత భాగస్వామిని తెలివిగా ఎన్నుకోవాలని సూచించాడు.. అలాగే, జీవితంలో అలాంటి మహిళలకు దూరంగా ఉండటమే బెటర్ అని చాణక్యుడు వివరించాడు.
మూర్ఖుడైన శిష్యుడు: ఆచార్య చాణక్యుడు ప్రకారం, అజ్ఞాన శిష్యుడికి ఏ పాఠం అర్ధంకాదు.. వివరించలేము.. తెలివి తక్కువ విద్యార్థికి మీ సమయాన్ని..శక్తిని వృధా చేయడంలో అర్థం లేదు. ఇతరులు చెప్పే దాని గురించి చింతించకండి. ఎందుకంటే అలాంటి వారి కోసం సమయం వృధా చేయడం పనికిరాదు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండండంటూ చాణక్యుడు బోధించాడు..
అనారోగ్యం బారిన పడిన వ్యక్తి: అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ప్రతికూల శక్తిని ప్రసరింపజేస్తాడు. అంతేకాక, అతను ఎల్లప్పుడూ విచారంగా ఉంటాడు. వాళ్ళు కూడా మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వరు. అందువల్ల అనారోగ్యంతో ఉన్న వారితో దూరం పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
ఈ ముగ్గురు వ్యక్తులను మాత్రమే కాకుండా, నిర్దిష్ట లక్షణాలు ఉన్న ఇతర రకాల వ్యక్తులకు.. అంటే ఒర్వలేని వారు, హాని తలపెట్టేవారు, అసూయతో బాధపడేవారు, దుర్భుద్ది గలవారు, పిరికివారు, భయంతో ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. జీవితంలో పురోగమించడానికి అబద్దాలు చెప్పడం, మద్యపానం, స్వార్థపరులు, అత్యాశపరులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలంటూ చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.
(గమనిక : పై సమాచారం ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి నుంచి తీసుకోబడింది.. ఈ వార్త ఉద్దేశ్యం సమాచారాన్ని అందించడం మాత్రమే.)