Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-14 18:13:53
TWM News :- ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి లైన్ క్లియర్ అయింది. ఈ ఏడాది రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి..ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్‌ల పదవీ కాలం త్వరలో ముగుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడటంతో పాటు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి,ఎమ్మెల్యే గొల్ల బాబూ రావుతో పాటు మేడా అమర్నాథ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం రెండో సెట్ నామినేషన్ పత్రాలు కూడా అధికారులకు అందజేశారు.
వాస్తవంగా ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు స్థానాలు వైసీపీకి దక్కాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యసభ బరిలో దిగుతుందంటూ కొంతకాలంగా ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీ నామినేషన్ పత్రాలు కూడా తీసుకోవడంతో పోటీ తప్పదని అంతా భావించారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికలు ఏపీలో కూడా జరుగుతాయని చర్చ జరిగింది. అయితే తాజాగా వైసీపీ అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థుల ఎంపిక లాంఛనమే అని తెలుస్తోంది..త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీకి దక్కాల్సి ఉంది. అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా 8 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం రేపోమాపో క్లారిటీ రానుంది. ఇక, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఇప్పటికే ఆమోదం పొందింది. మరో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఈ లెక్కన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోకపోయినా మరో 165 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దీని ప్రకారం ఒక్కో అభ్యర్థి గెలుపునకు కనీసం 42 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే.
అయితే వైఎస్సార్సీపీ టిక్కెట్ల కేటాయింపుల్లో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారనే ఉద్దేశంతో రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్థి ని నిలబెడతారని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇంతమంది ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఓటు వేయకుంటే చెడ్డ పేరు వస్తుందని భావించారు. మరోవైపు వైసీపీ అధిష్టానంపై మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి జగన్ మాటే తమ మాట అని చెప్పుకోచ్చారు. ఇలాం
టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి కుమర్‌లు భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల అంశంపై ఈ నేతల వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీకి దూరం అని చంద్రబాబు స్పష్టత ఇచ్చారట. టీడీపీ వెనక్కి తగ్గడంతో వైసీపీ అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కానుంది. అయితే తెలుగుదేశం పార్టీ 41 ఏళ్ల చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది.