Category : జాతీయ | Sub Category : రాజకీయం Posted on 2024-11-05 10:08:33
దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమైన ఎజెండాల్లో జమిలి ఎన్నికలు ఒకటి. దేశవ్యాప్తంగా నిత్యం జరుగుతున్న ఎలక్షన్ తంతు వల్ల సమయం, డబ్బు వృధా అవుతున్నాయని.. వాటికి చెక్ పెట్టాలంటే జమిలి ఎన్నికలే మార్గమని బీజేపీ భావిస్తోంది. అందుకే ఎలాగైనా జమిలి ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. అయితే జమిలి ఎన్నికల నిర్వహించాలనే ఆలోచన ఇప్పటిది కాదు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఈసారి ఎలాగైనా నిర్వహిస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోపే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు మోదీ. గెలిచిన ప్రతిసారి మోదీ కొన్ని కీలక అంశాలను తెరపైకి తెచ్చి వాటిని సార్టవుట్ చేసే పనిలో ఉంటున్నారు. అందులో భాగంగానే ఈసారి జమిలి ఎన్నికలు నిర్వహించడం, మహిళా రిజర్వేషన్ల అమలు, వక్ఫ్ బిల్లు లాంటివి క్లియర్ చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం మోదీ ప్రభుత్వం చకచకా పావులు కదుపుతున్నట్టు అర్థమవుతోంది. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వీటికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక్కడ బీజేపీ కూటమిగా బరిలోకి దిగింది. శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గంతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. ఈ మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకుంటే జమిలి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల టాక్. ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఓడిపోతే మాత్రం జమిలి ఎన్నికలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. జమిలి ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనేది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని ఢిల్లీ వర్గాలు చెప్తున్న మాట. ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే ఈ నెలాఖరులో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికలు, వక్ఫ్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లులను పెట్టి ఆమోదించుకోనుంది. అదే జరిగితే వచ్చే ఏడాది జనాభా లెక్కలను సేకరించడం, 2026లో నియోజకవర్గాలను పునర్విభజించడం, 2027లో జమిలి ఎన్నికలకు వెళ్లడం ఖాయం. అంటే 2027లో ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతుందని తెలుస్తోంది. మరి రెండేళ్ల ముందే అధికారాన్ని వదులుకుని జమిలి ఎన్నికలకు బీజేపీ వెళ్తుందా.. వెళ్లదా.. అనేది తెలియాల్సి ఉంది.