Category : జాతీయ | Sub Category : రాజకీయం Posted on 2024-11-04 16:34:37
TWM News : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు వాగ్దానాలు చేస్తోందని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలనను ఉదాహరణగా చూపుతూ, అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్ ఉందని మోదీ విమర్శించారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పలు విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ ప్లాట్ ఫాం వేదికగా ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. “కాంగ్రెస్ కు ఓటేస్తే అది పాలన ఉండదు, ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుంది, దోపిడి పెరుగుతుంది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హర్యానా ప్రజలు వారి అబద్ధాలను ఎలా తిప్పికొట్టారో.. స్థిరమైన అభివృద్ధికి నిరంతరం శ్రమించే ప్రభుత్వానికి ఎలా పట్టగట్టారో దేశమంతటికీ తెలుసు. భారతదేశ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు.. #FakePromisesOfCongress ని కాదు!’’ అంటూ విమర్శించారు.
కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాజకీయాలపై...
‘‘కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలలో బిజీగా ఉంది.. అభివృద్ధిని అందించడానికి కూడా ఇబ్బంది పడుతోంది.. అంతే కాదు, ఇప్పటికే ఉన్న పథకాలను కూడా వెనక్కి తీసుకోబోతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గతంలో, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో వారు ఐదేళ్లపాటు ఎప్పుడూ చూడని కొన్ని పథకాలపై వాగ్దానం చేశారు. కాంగ్రెస్ ఎలా పని చేస్తుందో చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి’’.. అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.‘‘నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ఏ రాష్ట్రంలో చూసినా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ అధ్వాన్నంగా మారుతోంది. ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. ఇది నిజంగా నమ్మి ఓటేసిన ప్రజల్ని మోసం చెయ్యడమే. ఇలాంటి రాజకీయాల వల్ల పేదలు, యువకులు, మహిళలు, రైతులు బాధితులవుతున్నారు. అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం సులభమే కానీ, వాటిని అమలు చెయ్యడం కష్టమన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తిస్తోంది. ఎన్నికల ముందు ఎన్నెన్నో చెబుతారు. వాటిని అమలు చెయ్యడం ఎప్పటికీ సాధ్యం కాదని వారికి కూడా తెలుసు” అంటూ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకొని విమర్శలు కురిపించారు.