Category : | Sub Category : క్రీడా Posted on 2024-02-12 10:41:08
TWM News : ఫలితం ఏం మారలేదు. సీనియర్ జట్టులాగే భారత యువ జట్టు ఆస్ట్రేలియా అడ్డుగోడను అధిగమించలేకపోయింది. ప్రపంచకప్ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ కు చేరుకున్న యంగ్ టీమిండియా ఫైనల్ ఫోబియాను మాత్రం అధిగమించలేకపోయింది. ఆదివారం (ఫిబ్రవరి 09) జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా విధించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక యంగ్ టీమిండియా చతికిలపడింది. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న టీమిండియా కల నెరవేరలేదు. టోర్నీలో నిలకడగా రాణించిన ఆసీస్ ఫైనల్ లో భారత్ ను చిత్తు చేసి మరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. గతేడాది నవంబర్ 19న వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో సీనియర్ ఆటగాళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారనుకుంటే.. కుర్రాళ్లూ కూడా క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిల్చారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు మరోసారి ఫైనల్ ఫోబియాను అధిగమించలేకపోయింది. ఆ స్ట్రేలియా బౌలర్ల ధాటికి 174 పరుగులకే ఆలౌట్ కావడంతో 79 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో రికార్డు స్థాయిలో 6వ సారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది టీమిండియా. ఈ భారీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటింగ్ పూర్తిగా ఒత్తిడికి గురై ఫ్లాప్ అయింది. మూడో ఓవర్‌లోనే టీమ్‌ఇండియా తొలి వికెట్ పడగా, ఆ తర్వాత ఒక్కో క్కరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆదర్శ్ సింగ్ మాత్రమే 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు కాగా.. ఆఖరి మ్యాచ్‌లో ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాసా విఫలమయ్యారు. ఫైనల్లో ముషీర్ ఖాన్ 22 పరుగుల వద్ద, ఉదయ్ సహారన్ 8 పరుగుల వద్ద, సచిన్ దస్ 9 పరుగుల వద్ద ఔట్ కావడంతో టీమిండియా ప్రపంచకప్ కల చెదిరిపోయింది.
చివర్లో మురుగన్ అభిషేక్ (42), నమన్ తివారీ (14)లు టీమ్ ఇండియాకు కొంత పోరాటాన్ని అందించారు, అయితే స్కోరు చాలా పెద్దది. దీంతో భారత జట్టు 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటయి 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.