Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-10 10:35:29
TWM News :- ఏపీలో మొన్నటిదాకా కాంగ్రెస్ అన్న పదమే వినిపించలేదు. అదో అంటరాని పదంలా చూశారంతా. ఆల్ ఆఫ్ సడెన్‌గా సీన్ ఛేంజ్ అయింది. ఇప్పుడు హస్తంలో కొత్తకళ కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మేమంటే మేం పోటీ చేస్తామంటూ ఆశావహులు పోటెత్తుతున్నారు. ఈ హఠాత్ పరిణామం వెనుక రీజన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో కోలాహలం కనిపిస్తోంది. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా స్థబ్దుగా ఉన్న ఏపీ కాంగ్రెస్‌లో ఈ మధ్య కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత.. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం మొదలైనట్టు కనిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఏపీలో కూడా ఈసారి గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తామని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో పోరాటంలోకి దిగాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే షర్మిల జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని ఏపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రారంభించారు. మొదట్లో దరఖాస్తులు పెద్దగా రావన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ అనూహ్యంగా అంతకుమించి అనేలా దరఖాస్తుల సంఖ్య పెరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్దసంఖ్యలో అప్లయ్ చేస్తున్నారు. 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు 793 మంది దరఖాస్తు చేసుకున్నారు. 25 పార్లమెంట్ స్థానాల్లో 105 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ అప్లికేషన్లకు చివరి రోజు కావడంతో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల బాధ్యతలు చేపట్టాక.. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామిక వాదంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందని పదే పదే చెబుతూ వస్తున్నారు మాణిక్కం ఠాగూర్. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. కులం, డబ్బు కోసం కాంగ్రెస్ రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు. వీటన్నింటితో పాటు ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారింది. ఇన్నాళ్లు కళావిహీనంగా కనిపించిన ఏపీ కాంగ్రెస్.. ఇప్పుడు కళకళలాడుతుండటం అటు లీడర్‌ని అటు కేడర్‌ని ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది.