Category : | Sub Category : క్రైమ్ Posted on 2024-02-09 11:19:33
TWM News : ఎక్కడో తీగ లాగితే…హైదరాబాద్‌లో డొంక కదిలింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఇచ్చిన సమాచారంతో ఏక కాలంలో మూడు చోట్ల NIA సోదాలు నిర్వహించింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీ నగర్‌లలో NIA తనిఖీలు కలకలం రేపాయి. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్‌తో పాటు రవి శర్మ అనే మరో వ్యక్తి ఇంట్లో NIA అధికారులు ఐదు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు.
దేశంలో మావోయిస్టుల బెడదను రూపు మాపాలనే కృత నిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం…. ఛత్తీస్‌గఢ్
దండకారణ్యంలోని రెడ్ కారిడార్‌పై రణభేరి మోగించింది. దండకారణ్యంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఏవోబీలలోని మావోయిస్టుల స్థావరాలపై భద్రతా బలగాలు పెద్దఎత్తున దాడులు జరుపుతున్నాయి. భారీగా కూంబింగ్ జరుపుతున్నాయి. సరిగ్గా ఇదే నేపథ్యంలో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్లో ఒకరైన దీపక్ రావును కొద్ది నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు.
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ రావు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో NIA సోదాలు నిర్వహించింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీ నగర్…ఇలా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో NIA అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్‌ని NIA అధికారులు టార్గెట్ చేశారు. హిమాయత్‌నగర్‌లోని వేణుగోపాల్ నివాసంలో తెల్లవారుజామునే సోదాలు చేపట్టిన అధికారులు….దాదాపు ఐదు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. వేణు సెల్‌ఫోన్‌ను ఎన్‌ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎల్బీ నగర్‌లోని రవి శర్మ నివాసంలోనూ ఎన్‌ఐఎ సోదాలు జరిగాయి. రవి శర్మ, సెల్‌ఫోన్, బుక్‌లెట్, కరపత్రాలను ఎన్‌ఐఎ స్వాధీనం చేసుకుంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న నేపథ్యంలోనే ఎన్‌ఐఎ ఈ సోదాలు నిర్వహించిందని సమాచారం.